NTV Telugu Site icon

Arvind Kejriwal: చంద్రబాబు, నితీష్‌లకు కేజ్రీవాల్ లేఖ.. విషయం ఏంటంటే.

Cbn

Cbn

Arvind Kejriwal: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, డీఎంకే ఇతర ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, తన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి, కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందిన నిన్న అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే, అమిత్ షా వ్యాఖ్యలపై ఈ రోజు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై టీడీపీ, జేడీయూలకు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన లేఖలు రాశారు. ఈ రెండు పార్టీలు బీజేపీ అధికారాన్ని సాధించేందుకు అవసరమైన ఎంపీలను సమకూర్చాయి. ఎన్డీయే మెజారిటీ ఫిగర్ దాటేందుకు సాయపడ్డాయి.

Read Also: Rahul Gandhi: పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీని తోసేసిన రాహుల్ గాంధీ.. తలకు గాయం..

‘‘బాబాసాహెబ్ కేవలం నాయకుడు మాత్రమే కాదు, మన జాతికి ఆత్మ. బీజేపీ చేసిన ప్రకటన తర్వాత, మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రలు ఆశిస్తున్నారు.’’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.

మంగళవారం రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. ప్రతిపక్ష నేతల తీరును తప్పుబడుతూ..‘‘ఇప్పుడు ప్రతిపక్షాలు అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది, ఇంతలా దేవుడు పేరు తలుచుకుంటే వారికి స్వర్గంలో చోటు లభించి ఉండేది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలే మొత్తం వివాదానికి కారణమైంది. అయితే, ఈ స్పీచ్‌లోని కొంత భాగాన్ని కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ నేతలు షేర్ చేసుకున్నారు.

Show comments