Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..

  • కాంగ్రెస్‌లో శశి థరూర్ వ్యాఖ్యల కలకలం..
  • రాహుల్ కార్యక్రమానికి, సీజేపీకి వచ్చిన మద్దతు రాలేదని కామెంట్స్..
  • బీజేపీని సంతృప్తిపరిచే వ్యాఖ్యలు వద్దని కేసీ వేణుగోపాల్ హితవు..
Congress

Congress

Congress: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో మరోసారి వివాదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో శశి థరూర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నిర్వహించిన ‘‘ఛాత్రోం కీ గూంజ్’’ కార్యక్రమానికి, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి వచ్చినంత స్పందన రాలేదని, కాంగ్రెస్ దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

థరూర్ చేసిన వ్యాఖ్యలపై వేణుగోపాల్ స్పందిస్తూ.. తాను ఈ వ్యాఖ్యల్ని మీడియా కథనాల్లో చూశానని, పూర్తి సందర్భం వినలేదని చెప్పారు. థరూర్ తన వ్యాఖ్యలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సూచించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు బహిరంగంగా మాట్లాడేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘‘కాంగ్రెస్ సభ్యులు ఎప్పుడూ పార్టీ విధానాలు, క్రమశిక్షణ పాటించకపోయినా.. బీజేపీని మెప్పించేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలి’’ అని కేసీ వేణుగోపాల్ అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే అవకాశం దొరికితే బీజేపీ సంతోషిస్తుందని అన్నారు. థరూర్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారని తాను భావించడం లేదని చెప్పారు.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ జెన్-జీ యువతను ఆకట్టుకునేందుకు నిర్వహిస్తున్న విద్యార్థి కార్యక్రమానికి కేసీ వేణుగోపాల్ మద్దతు ఇచ్చారు. యూపీ అలహాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి సాధారణ కార్యకర్తలే కాకుండా పెద్ద సంఖ్యలో యువత వచ్చిందని అన్నారు. కోటా, డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమాల్లో కూడా ఇదే తరహా స్పందన కనిపించిందని అన్నారు. అలహాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.