NTV Telugu Site icon

Jammu Kashmir: ఇంటింటికి వెళ్లి నీరు అడిగిన ఉగ్రవాదులు.. కథువా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు హతం..

Kathua

Kathua

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ అట్టుడుకుతోంది. వరసగా ఉగ్రవాద ఘటనలతో ఆ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆదివారం రియాసిలో బస్సుపై దాడి చేసిన ఘటనలో 10 మంది యాత్రికులు చనిపోయారు. ఇది మరవక ముందే కథువాలో మంగళవారం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. కథువా జిల్లాలోని సైదా గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు ఇంటింటికి వెళ్లి నీరు అడగటంతో అనుమానించిన గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

Read Also: Prakash Dantuluri: ఎక్కువ చెబితే కిక్ పోతుంది.. క‌థ‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌దు: ఏవమ్ దర్శకుడి interview

నిన్న సాయంత్రం భద్రతా అధికారులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. బుధవారం మధ్యాహ్నం కతువాలోని సైదా గ్రామం సమీపంలో దాక్కున్న రెండో ఉగ్రవాదిని ఆర్మీ, పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ హతమార్చింది. తెల్లవారుజామున 3 గంటలకు భద్రతా బలగాలపై కాల్పులు జరిపి తప్పించుకోవాలని ప్రయత్నించిన రెండో ఉగ్రవాది ఒక సీఆర్పీఎఫ్ జవాన్‌ని చంపాడు. హతమైన రెండో ఉగ్రవాది దగ్గర యూఎస్ తయారీ ఎం4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు దోడాలో ఆర్మీ పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు, ఎస్పీఓ గాయపడ్డారు.

అంతకుముందు, ఆదివారం రోజున జమ్మూలో కత్రా నుంచి శివఖోరీ ఆలయానికి యాత్రికులు వెళ్తున్న సమయంలో బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో 10 మంది మరణించారు. లష్కరే తోయిబా కమాండర్ అబు హమ్జా ఆదేశాల మేరకు ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. వీరి కోసం భద్రతా బలగాలకు చెందిన 11 టీంలు గాలింపు చేపడుతున్నాయి.