NTV Telugu Site icon

karnataka: స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా విద్యుత్ షాక్.. తల్లి, కొడుకుకు తీవ్రగాయాలు

Karnataka

Karnataka

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా తల్లి, కుమారుడు తీవ్రగాయాలతో కొట్టిమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని కలబురగిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కలబురగి మోహన్ లాడ్జి సమీపంలో స్కూల్ బస్సు కోసం ఓ తల్లి.. కొడుకుతో నిరీక్షిస్తోంది. ఇంతలో బస్సు రానే వచ్చింది. స్కూల్ బస్సు ఆగిన చోటే విద్యుత్ వైర్ తెగిపడి ఉంది. ఇది గమనించకపోవడంతో మహిళ విద్యుత్ వైర్‌పై కాలు వేసింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. తల్లికి ఏదో అయిందని పట్టుకోబోగా చిన్నారికి కూడా గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న వారంతా సాయం చేసేందుకు ప్రయత్నించినా మంటలు చెలరేగడంతో భయపడ్డారు. మొత్తానికి చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కొడుకు చికిత్స పొందుతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మంటలు అంటుకున్న సమయంలో స్కూల్ బస్సులో 11 మంది చిన్నారులు ఉన్నారు. అయితే డ్రైవర్ బస్సును కొంచెం ముందుకు పోనివ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు వాపోయారు. పిల్లలంతా క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా గాయపడిన బాలుడు వికలాంగుడు కావడం విశేషం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాప్ సమీపంలో విద్యుత్ వైరు వేలాడుతూ ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకుందని వెల్లడించారు. బస్సు లోపలికి వెళ్లే సరికి కేబుల్ తగలడంతో భాగ్యశ్రీకి కరెంట్ షాక్ తగిలిందని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విద్యుత్తు శాఖపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.