Karnataka: కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో మరో వివాదం తెర పైకి వచ్చింది. కర్ణాటక యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి సెమిస్టర్ పాఠ్యపుస్తకాంలో ‘‘విద్వేషపూరిత’’ కంటెంట్ ఉండటంపై వివాదం చెలరేగింది. కర్ణాటక లా స్టూడెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ‘‘బెళగు 1’’ పుస్తకంలో ‘‘రాష్ట్రీయతే’’ అనే శీర్షికతో కూడిన అంశాలు ఉన్నాయని, ఇది భారత ఐక్యతకు భంగం కలిగించే అభిప్రాయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ అధ్యాయం ద్వారా ఆర్ఎస్ఎస్, రామమందిర నిర్మాణం, భారతమాత, భువనేశ్వరి దేవీ వంటి గౌరవనీయమైన వ్యక్తులనున విమర్శిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్ కాదు..
మత విద్వేషాలను ప్రోత్సహించేలా కంటెంట్ ఉందని, ‘‘భారత మాతను హిందువులకు మాత్రమే ప్రత్యేకమైన దేవత’’గా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ పుస్తకం ద్వారా ఆర్ఎస్ఎస్‌ని విమర్శిస్తున్నారని, సంఘ్ పరివార్ వంటి పదాలను అవమానకరమైన రీతిలో ఉపయోగించిందని ఆరోపించారు. సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త అరుణ్ జోషి దీనిపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌తో పాటు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌కి లేఖలు రాశారు. ఈ వివాదాస్పద సిలబస్‌ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
అధ్యాయంలోని చాలా అంశాలు ‘‘జాతీయ వ్యతిరేకతను’’ ప్రోత్సహిస్తున్నాయని జోషి చెప్పారు. రాజ్యంగ వ్యతిరేక, భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక కంటెంట్ ఉందని ఇది ‘‘కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఎజెండా’’లను ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. భారతమాత హిందువులకు మాత్రమే దేవత అని, ఇతర వర్గాలైన ముస్లిం, సిక్కు, జైన్ వర్గాలకు మినహాయించేలా చిత్రీకరించారని ఆరోపించారు. ముస్లింలు పరాయీకరణ అనే భావనను అనుభవిస్తున్నారని తప్పుడు కథనాలను పాఠ్యాంశంలో జొప్పించారని ఆరోపించారు.