NTV Telugu Site icon

Congress: హామీలతో ఆర్థిక సమస్యలు.. ‘‘గ్రీన్ సెస్’’ విధించే దిశగా కర్ణాటక సర్కార్..

Siddaramaiah

Siddaramaiah

Congress: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బడిముబ్బడిగా హామీల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ హామీల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పన్నులు విధించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన ‘‘గ్రీన్ సెస్’’ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. అక్కడి ప్రతిపక్ష బీజేపీ ఈ విషయాన్ని రాజకీయం చేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం.. పశ్చిమ కనుమల్లో పట్టే నదుల నీటిని వినియోగించుకునే కర్ణాటక నగరాల్లో నీటి బిల్లులపై రూ. 2 నుంచి రూ. 3 వసూలు చేస్తారు.

అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ హామీ పథకాల కారనంగా ఆర్థిక పరిస్థితి క్షీణించిందని, మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం రహస్యం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆదాయాన్ని సంపాదించడానికే గ్రీన్ సెస్ విధిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి సెస్ ఇది కాదు. ఎన్నికైన తర్వాత తన మొదటి బడ్జెట్‌లో, కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 2023 రాష్ట్ర బడ్జెట్‌లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై 20% ఎక్సైజ్ సుంకాన్ని మరియు బీర్ ధరలపై 10% పెరుగుదలను ప్రకటించింది. ఆల్కహాలిక్ పానీయాలు కాకుండా, క్యాబ్‌లు మరియు ఆటో రిక్షాలతో సహా కొత్తగా నమోదు చేసుకున్న వాణిజ్య రవాణా వాహనాలపై రవాణా సెస్‌లో 3% పెంపును ప్రకటించారు.

అక్టోబర్ 2023లో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల గైడెన్స్ వాల్యూ విలువలో 25-30 శాతం పెరుగుదలను ప్రకటించింది. జూన్ 2024లో పెట్రోల్, డిజిల్‌పై అమ్మకపు పన్నును లీటర్‌కి రూ. 3 పెంచింది. ఆగస్టు 2024లో సిద్ధరామయ్య ప్రభుత్వం ‘‘స్ట్రాంగ్ బీర్’’పై ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని ప్రతిపాదించింది. ఇది అమలు అయితే కర్ణాటకలో ఏడాది కాలంలో బీర్ ధరలు పెరగడం ఇది మూడోసారి అవుతుంది.

కర్నాటక ఆర్థిక సవాళ్ల కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలో ఆదాయ ఉత్పత్తిని మెరుగుపరచడం, ఆర్థిక లీక్‌లను అరికట్టడంపై మార్గదర్శకత్వం కోసం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)ని నియమించుకునేలా చేసింది. అయితే ఈ చర్య రాజకీయ వివాదానికి దారి తీసింది. కన్సల్టెన్సీకి రూ. 9.5 కోట్ల రుసుము చెల్లించడాన్ని బిజెపి విమర్శించింది. అయితే, నిధుల కొరత ఆరోపణల్ని సిద్ధరామయ్య ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిధులకు కొరత లేదని, బీజేపీ ప్రజలకు అబద్ధాలు చెబుతోందని, ఐదు హామీ పథకాల అమలును సాకుగా చూపుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అసత్యాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

Show comments