Monkey fever: కర్ణాటక రాష్ట్రంలో ‘మంకీ ఫీవర్’ వ్యాధి కలవరపెడుతోంది. క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ)గా పిలువబడే ఈ వ్యాధి బారిన పడి మరో వ్యక్తి మరణించాడు. చిక్కమగళూర్‌లో 43 ఏళ్ల వ్యవసాయ కూలీ బుధవారం ఉదయం మృతి చెందింది. కేఎఫ్‌డీ ఇన్‌ఫెక్షన్‌తో మహిళ ఫిబ్రవరి 21న శివమొగ్గలోని మెగాన్ హాస్పిటల్‌లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో 10 రోజుల వ్యవధిలో ముగ్గురు మరణించారు. మరోవైపు కేఎఫ్‌డీ వ్యాక్సిన్ల స్టాక్ అయిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
అంతకుముందు ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్ధాపూర్ పట్టణంలో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే ఈ సారి మంకీ ఫీవర్ వ్యాప్తి అధ్వానంగా ఉందని, ముఖ్యంగా 12 ఏళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపుగా 500 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి రాష్ట్రాన్ని తాకుతుందని మేం ఊహించలేదని, అందుకే వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున నిల్వ చేయలేదని, వ్యాక్సిన్ల తయారీ జరుగుతోందని మే 2025 నాటికి మాత్రమే అందుబాటులోకి వస్తాయని కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు.
Read Also: Gaami Trailer: విశ్వక్ సేన్ గామి ట్రైలర్.. మనిషిని ముట్టుకుంటే చచ్చిపోవడమే
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా ప్రతీ ఏడాది మంకీఫీవర్ బారిన పడుతోంది. ప్రతీ ఏడాది ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లలో 60 శాతం ఈ జిల్లాకు పంపిణీ చేయబడుతున్నాయి. మిగిలినవి బెళగావి, శివమొగ్గ, కొడుగు, చిక్కమగళూర్, మైసూర్ జిల్లాలకు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిద్ధాపూర్ పట్టణంలో ప్రస్తుతం 100 మందికి పైగా వ్యక్తులకు మంకీఫీవర్ సోకింది. దీంతో ఆ పట్టణంలోని ప్రజలు భయంతో పక్కనే ఉన్న యల్లాపూర్‌కి వలస వెళ్తున్నారు.
అయితే, ఈ వైరస్ ప్రాణాంతకం కాదని, సోకిన వారు ఐదు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి రెండోసారి ఇన్ఫెక్షన్ సోకితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలని వైద్యులు కోరుతున్నారు. జబ్బు పడిన కోతులను కరిచిన ఈగలు మనుషులను కొరికితే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
