NTV Telugu Site icon

Minister Slaps Woman: మహిళను చెంపదెబ్బ కొట్టిన మంత్రి.. వీడియో వైరల్..

Karnataka

Karnataka

Karnataka Minister Slaps Woman: కొంతమంది నేతల దురుసు ప్రవర్తన ఆయా పార్టీలకు చేటు తెస్తున్నాయి. అధికారం తలకెక్కిన నాయకులు ప్రజలతో ఎలా నడుచుకోవాలనేది తెలియడం లేదు. ఆగ్రహంతో ప్రజలను దూషించడం, చేయి చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. తన సమస్య చెప్పుకోవడానికి వచ్చిన మహిళపై చేయి చేసుకున్నారు ఓ మంత్రి. అధికారంలో ఉన్న వ్యక్తి, మంత్రి అయి ఉండీ మహిళ చెంపపై కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో మంత్రి సదరు మహిళ చెంపపై కొట్టడం కెమెరాలకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది.

Read Also: Namaz In Train: ట్రైన్‌లో నమాజ్.. విచారణకు యోగి సర్కార్ ఆదేశం..

కర్ణాటక మౌళిక సదుపాయాల మంత్రి, బీజేపీకి చెందిన వీ సోమన్న చామరాజనగర్ జిల్లా హంగల గ్రామంలో భూమి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి హజరయ్యారు. అర్హులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు. అయితే తనకు పట్టా రాలేదని మంత్రికి చెప్పుకునేందుకు వచ్చిన మహిళపై సోమన్న చెంపపై కొట్టారు. ఆ తరువాత సదరు మహిళ మంత్రి కాళ్లను మొక్కింది. ఈ ఘటన అనంతరం సోమన్న, సదరు మహిళకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దేవాదాయ శాఖ కింద తనకు ప్లాటు మంజూరు చేయలేదని మహిళ, మంత్రికి చెప్పుకునేందుకు వచ్చిన సందర్భంలో మంత్రి సోమన్న మహిళను కొట్టారు.

కర్ణాటకలోని బీజేపీ మంత్రులు ఇలాంటి ఘటనల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్ నెలలో న్యాయశాఖ మంత్రి జేసీ మధు స్వామి కూడా ఓ మహిళ రైతుతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 3న బీజేపీ కర్ణాటక ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, తన ఆస్తిని కూల్చడాన్ని వ్యతిరేకించిన మహిళను బెదిరించి, దుర్భాషలాడిన వీడియో కూడా వివాదాస్పదం అయింది. అంతకుముందు కర్ణాటకలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్ ను జేడీయూ నాయకుడు చెంపదెబ్బ కొట్టడం వివాదం రాజేసింది.