NTV Telugu Site icon

Karnataka: బెంగళూర్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన.. హక్కుల కోసం పోరాటం..

Bengaluru,

Bengaluru,

Karnataka: కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూర్‌లోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. ఐటీ ఉద్యోగులు ‘‘ ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యత ప్రతీ ఉద్యోగి హక్కు’’ నినాదమిస్తున్నారు. అధిక పనిగంటలు, ఓవర్ టైమ్ పరిహారం లేకపోవడం, ఉద్యోగులు అధికారిక పని గంటలకు మించి అందుబాటులో ఉండాలని కోరడం వంటి ఆందోళనల్ని పరిష్కరించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది.

న్యాయమైన పని పరిస్థితుల కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 2024లో ఐటీ కంపెనీలు ఓవర్ టైం వేతన నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయంటూ, చట్టబద్ధమైన పని గంటల్ని పొడగిస్తున్నారంటూ కర్నాటక కార్మిక మంత్రికి ఐటీ ఉద్యోగం సంఘం మెమోరాండం సమర్పించింది. అనేక సమావేశాలు నిర్వహించినా, నిరసనలు తెలిపినప్పటికీ పని గంటల్ని నియంత్రించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని యూనియన్ ఆరోపిస్తోంది. పలువురు సంస్థల యజమానులు పనిగంటల గురించి ఇటీవల కామెంట్స్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు నిరసనకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటలు పని చేయాలని కోరారు. అదే విధంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, వారానికి 70 గంటలు పనిచేయాలని కోరారు. ఇద్దరి స్టేట్మెంట్‌లపై ఉద్యో్గులు మండిపడ్డారు.

ఉద్యోగుల డిమాండ్లు ఇవే:

*పని గంటల పరిమితుల అమలు: అధిక ఓవర్ టైం మరియు ఉద్యోగుల బర్న్ అవుట్ ను నివారించడానికి కఠినమైన రోజువారీ పని గంటల పరిమితులను అమలు చేయడం.
* ఐటీ రంగ మినహాయింపుల రద్దు: పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్లు) చట్టం కింద ఐటీ రంగానికి మంజూరు చేసిన మినహాయింపులను తొలగించాలి, ఇది ప్రస్తుతం కంపెనీలు డిమాండ్ చేసే పని పరిస్థితులను విధించడానికి అనుమతిస్తుంది.
* కార్మిక చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు: కఠినమైన అమలు చర్యల ద్వారా కార్మిక చట్టాలను ఉల్లంఘించే కంపెనీలు జవాబుదారీగా ఉండేలా చూసుకోవాలి.
*’డిస్‌కనెక్ట్ హక్కు’ అమలు: ఉద్యోగులు పని గంటలు తర్వాత కమ్యూనికేషన్‌ను తిరస్కరించడానికి, పరిణామాలను ఎదుర్కోకుండా అనుమతించే విధానాలను ప్రవేశపెట్టడం. పని- వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన సరిహద్దును నిర్ధారించడం.