Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు

  • పెళ్లి అంటే నియంత్రించే లైసెన్స్ కాదు
  • తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు అనుమతి అక్కర్లేదు
  • భర్తకు హైకోర్టు ఆదేశం
Karnataka Hc

Karnataka Hc

భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలంటే భర్త లేదా అత్తమామల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే అత్తమామలకు సేవ చేయాలని, ఇంటి పనులు చేయాలని భార్యను బలవంతం చేయలేరని స్పష్టం చేసింది. “పెళ్లి అనేది భాగస్వామి స్వేచ్ఛను నియంత్రించే, ఆదేశించే లేదా ఆధిపత్యం చెలాయించే లైసెన్స్ కాదు” అని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ చిల్లకూరు సుమలత ఈ వ్యాఖ్యలు చేశారు. తుమకూరు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన మెయింటెనెన్స్ ఆదేశాలను సవాల్ చేస్తూ బెంగళూరు గ్రామీణ జిల్లాకు చెందిన 36 ఏళ్ల సతీష్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ఫ్యామిలీ కోర్టు భార్యకు నెలకు రూ.5,000, మైనర్ కుమార్తెకు రూ.4,000 చొప్పున మొత్తం రూ.9,000 మెయింటెనెన్స్ చెల్లించాలని భర్తను ఆదేశించింది. భార్య, కుమార్తె తొలుత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), 2023లోని సెక్షన్ 144 కింద నెలకు రూ.30,000 మెయింటెనెన్స్ కోరారు. అయితే ఈ మొత్తం ఎక్కువగా ఉందంటూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు.

భర్త ఆరోపణలు ఇవే

తాను కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నానని, తన తల్లిదండ్రుల బాధ్యత కూడా తనపైనే ఉందని భర్త కోర్టుకు తెలిపాడు. భార్య తన కుమార్తెతో కలిసి స్వచ్ఛందంగా అత్తింటి నుంచి వెళ్లిపోయిందని, తాను వారిని పోషించేందుకు ఎప్పుడూ నిరాకరించలేదని వాదించాడు. పెళ్లయిన తొలి ఆరు నెలలు తమ దాంపత్య జీవితం సంతోషంగా సాగిందని, ఆ తర్వాత భార్య తన తల్లిదండ్రులు, అత్తమామల పట్ల వైఖరిని మార్చుకుందని ఆరోపించాడు. ఇంటి పనులు చేయడం, తన తల్లిదండ్రులను చూసుకోవడం మానేసిందని, తనతో పాటు తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా తరచూ పుట్టింటికి వెళ్లేదని పేర్కొన్నాడు.

అయితే భార్య మాత్రం తన భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు తనను వేధించి, కొట్టారని ఆరోపించింది. అదనంగా డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేశారని, భర్త జూదం ఆడటంతో పాటు మద్యం సేవించి పలుమార్లు తనపై దాడి చేశాడని తెలిపింది. తనపై వేధింపులు ఉన్నప్పటికీ దాంపత్య బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని హామీ ఇచ్చింది.

భార్య ప్రవర్తనపై భర్త చేసిన ఆరోపణలను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అతని వాదనలను చూస్తే.. ఇంటి పనులు చేయడానికి, తన తల్లిదండ్రులను చూసుకోవడానికి భార్యను ఉద్యోగిగా నియమించుకున్నట్లుగా భావిస్తున్నట్టు ఉందని వ్యాఖ్యానించింది. భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త, అత్తమామల అనుమతి ఎందుకు తీసుకోవాలని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఒక భారతీయ మహిళ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలనుకున్నప్పుడు.. అత్తింట్లో ఉన్న ప్రతి ఒక్కరి అనుమతి ఎందుకు తీసుకోవాలి?” అని జస్టిస్ సుమలత ప్రశ్నించారు.

ఇంటి పనులను పురుషులు, మహిళలు సమానంగా పంచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులకు సంరక్షణ అవసరమైతే ప్రధాన బాధ్యత వారి కుమారుడు లేదా కుమార్తెదేనని.. కోడలు లేదా అల్లుడిపై ఆ బాధ్యతను బలవంతంగా మోపకూడదని పేర్కొంది. అత్తమామలను చూసుకోవడం స్వచ్ఛందంగా ఉండాలి కానీ బలవంతంగా చేయించకూడదని స్పష్టం చేసింది.

లైసెన్స్ కాదు

భార్య తన భర్తను విడిచిపెట్టి వెళ్లడానికి తగిన కారణం ఉందని హైకోర్టు పేర్కొంది. పెళ్లి అనేది కేవలం సంప్రదాయాలు, వేడుకలతో ఏర్పడే బంధం కాదని.. ప్రేమ, నమ్మకం, గౌరవం, పరస్పర సహకారం, అవగాహనపై ఆధారపడిన బంధమని తెలిపింది. మహిళ తన కెరీర్, ఆర్థిక వ్యవహారాలు సహా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కును కలిగి ఉందని కోర్టు స్పష్టం చేసింది. “భర్త తన భార్యను తన ఇష్టాలు, అంచనాలకు అనుగుణంగా జీవించాలని బలవంతం చేయలేడు. పెళ్లి అనేది జీవిత భాగస్వామి వ్యక్తిత్వం, స్వేచ్ఛ, ఇష్టాన్ని నియంత్రించడానికి, ఆదేశించడానికి లేదా ఆధిపత్యం చెలాయించడానికి లైసెన్స్ కాదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.

కుటుంబం పట్ల భార్య అంకితభావాన్ని విధేయత, లొంగుబాటుతో కొలవలేమని తెలిపింది. “పెళ్లి అనేది అసమాన వ్యక్తుల మధ్య ఉండే సంబంధం కాదు” అని పేర్కొంది. లింగం కారణంగా మహిళ స్వేచ్ఛను పరిమితం చేయడం సమానత్వం, మానవ గౌరవం, సామాజిక న్యాయానికి విరుద్ధమని స్పష్టం చేసింది.

ఫ్యామిలీ కోర్టు విధించిన నెలకు రూ.9,000 మెయింటెనెన్స్‌ను కూడా హైకోర్టు తగ్గించేందుకు నిరాకరించింది. భార్య, కుమార్తెకు కలిపి రోజుకు రూ.300 అంటే ఒక్కొక్కరికి రోజుకు రూ.150 మాత్రమే వస్తుందని కోర్టు పేర్కొంది. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్కరికి రోజుకు రూ.150 కనీస జీవన ప్రమాణాలను కొనసాగించడానికి కూడా సరిపోదని వ్యాఖ్యానించింది. మెయింటెనెన్స్ మొత్తాన్ని మరింత తగ్గించడానికి భర్త చేసిన విజ్ఞప్తిలో ఎలాంటి మెరిట్ లేదని పేర్కొన్న హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది.