NTV Telugu Site icon

Karnataka Eidgah Case: ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

Karnataka Hubballi Edgah Case

Karnataka Hubballi Edgah Case

Karnataka HC allows Ganesh festivities at Hubballi edgah: వినాయక చవితి ముందు కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు జరుపుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అర్థరాత్రి ఈ కేసును విచారించిన ఈ కోర్టు హుబ్బళ్లి-ధార్వాడ్ ఈద్గా మైదానంలో వినాయక చవితి వేడుకలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అంతకు ముందు బెంగళూర్ ఈద్గాలో గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును వెల్లడించడం విశేషం.

బెంగళూర్ ఈద్గాకు సంబంధించి భూమి యాజమాన్య వివాదం హుబ్బళ్లి కేసులో లేదని హైకోర్టు పేర్కొంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించవని జస్టిస్ అశోక్ ఎస్ కినాగి వ్యాఖ్యానించారు. హుబ్బళ్లి మైదానం కార్పొరేషన్ ఆస్తి అని గతంలో రంజాన్, బక్రీద్ వేడుకల సమయంలో ఎవరూ జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి అన్నారు. అంతకుముందు బెంగళూర్ ఈద్గాలో గణేష్ చతుర్థి విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఏఎస్ ఓకా, ఎంఎం సుందరేష్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం యథాతథ స్థితి కొనసాగాలని ఆదేశించింది. బెంగళూర్ ఈద్గాలో గణేష్ చతుర్థి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంజుమన్ ఏ ఇస్లాం సంస్థ ప్రభుత్వం ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో ఇది వివాదంగా మారింది.

Read Also: Live: గణేష్ చతుర్థి రోజున ఇంట్లో ఈ స్తోత్రం వింటే.. అఖండ ఐశ్వర్యం మీ సొంతం

హైకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. అనవసరంగా వివాదం సృష్టించాలనుకుంటున్నారని.. ఇంతకు ముందు ఈ మైదానంలో రెండు సార్లు నమాజ్ కు అనుమతి ఇచ్చారని.. ఇది పబ్లిక్ ప్రావర్టీ అని వివాదానికి ఆస్కారం ఉండదని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలతో పాటు కొంత మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని.. ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. నమాజ్ చేయడానికి మాకు అభ్యంతరం లేదని.. అలాగే గణేష్ ఉత్సవాలను కూడా వ్యతిరేకించకూడదని కేంద్ర మంత్రి అన్నారు.