Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇదిలా ఉంటే గురువారం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి, మంత్రి వర్గం ప్రమాణస్వీకారం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అన్ని మిత్రపక్షాలకు ఆహ్వనాలు పంపించనుంది. కర్ణాటక మంత్రివర్గం ఒకటి రెండు రోజుల్లో ఖరారు అవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ రోజు సాయంత్రం బెంగళూర్ లో సీఎల్పీ సమావేశం జరగనుంది. అయితే ముఖ్యమంత్రి ఎంపిక అంశాన్ని అధిష్టానానికే వదిలేస్తూ సీఎల్పీ తీర్మానం చేయనుంది. ఈ రోజు సీఎం అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోరని తెలుస్తోంది. సీఎల్పీ సమావేశం అనంతరం హైకమాండ్ కు రిపోర్ట్ అందిస్తామని, వారే సీఎం ఎవరనేదానిని ప్రకటిస్తారని పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
Read Also: Vishwak Sen: గంగానమ్మ జాతరతో శివాలెత్తిస్తున్న మాస్ కా దాస్…
ఇదిలా ఉంటే డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య ముఖ్యమంత్రి ఎవరనేదానిపై అంతా సస్పెన్స్ నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు రెండువర్గాలుగా విడిపోయి తమ నాయకులే సీఎం కావాలంటూ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. డీకే శివకుమార్ కు మద్దతుగా బెంగళూర్ లోని ఆయన నివాసం ముందు పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆయన అభిమానులు గుమిగూడి ‘‘శివకుమారే సీఎం కావాలి’’ అంటూ నినాదాలు చేశారు.
224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకుంటే.. బీజేపీ 66, జేడీయూ 19 స్థానాలకే పరిమితమయ్యాయి. చాలా రోజులుగా విజయం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ విజయం బూస్ట్ ఇచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాయి.
