NTV Telugu Site icon

Annamalai: కమలం ఎప్పటికీ వికసించదు, అన్నామలై రాజీనామా చేయాలి..కనిమొళి డిమాండ్..

Annamalai

Annamalai

Annamalai: డీఎంకే నేత, ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి తూత్తుకూడి నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. కనిమొళి 5,40,729 ఓట్లతో తూత్తుక్కుడి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గురువారం ఆమె తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై విరుచుకుపడ్డారు. కరుణానిధిపై చేసిన వ్యాఖ్యలపై అన్నామలై తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్నామలై తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి పోటీ చేశారు. అయితే, ఆయన డీఎంకే నేత గణపతి రాజ్‌కుమార్ చేతిలో లక్షకు పైగా మెజారిటీతో ఓడిపోయారు.

Read Also: Satyabhama: దర్శకత్వం అమ్మలాంటి పని.. నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత: శశికిరణ్ తిక్క ఇంటర్వ్యూ

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పరాజయంపై ఆయన బుధవారం మాట్లాడారు. తమకు సీట్లు దక్కకున్నా ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చకుంటామని, వచ్చే ఎన్నికల్లో్ తప్పకుండా తమిళ నేలపై నుంచి బీజేపీ ఎంపీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా ‘‘తన తండ్రి కరుణానిధి అయితే నేను కూడా ఈపాటికి ఎన్నికల్లో గెలిచి ఉండేవాడిని, మా నాన్న పేరు కుప్పుస్వామి, కాబట్టి నాకు కొంత సమయం పడుతుంది’’ అని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు కనిమొళి ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు అన్నామలై తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోడీపై విమర్శలు చేసేందుకు కనిమొళికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. దీనిపై కూడా ఆమె స్పందించారు. ‘‘ అన్నామలై నన్ను తరుచుగా ఒక ప్రశ్న అడిగేవాడు. కనిమొళికి ఎలాంటి అర్హతలు ఉన్నాయి?. ఎలాంటి అర్హతలు లేకుండా బీజేపీకి అధినేతగా కొనసాగడం మంచిది కాదు. తమిళనాడులో కమలం(బీజేపీ) ఎప్పటికీ వికసించదు’’ అని ఆమె అన్నారు.