Kangana Ranaut: సంజయ్, ఇందిరా, రాజీవ్ గాంధీ మరణాలు.. సోనియాపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు..

  • గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.
  • సోనియా గాంధీ రాజకీయంగా కీలక స్థానానికి ఎలా చేరుకున్నారంటూ ప్రశ్నలు.
  • 1981 నాటి వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్.
Kangana

Kangana

Kangana Ranaut: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీని ‘‘అనుమానాస్పద విదేశీయురాలు’’గా అభివర్ణించారు. ఆమె భారత రాజకీయాల్లోకి ఎలా వచ్చారనే దానిపై ప్రశ్నల్ని లేవనెత్తారు. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీని కుటుంబం నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. గాంధీ కుటుంబానికి సంబంధించిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కంగనా దానిని షేర్ చేసింది. ఈ వీడియోలో సోనియా, మేనకా గాంధీల మధ్య విభేదాలు ఉన్నట్లు వ్యక్తమవుతుందని ఆమె పేర్కొన్నారు.

గాంధీ కుటుంబ వీడియోతో కంగనా విమర్శలు..

సోనియా గాంధీ ఆత్మకథ ‘‘ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’’ విడుదల నేపథ్యంలో కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు. వైరల్ అవుతున్న పాత వీడియోలో ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, మేనకా గాంధీతో పాటు చిన్నారులైన రాహుల్, ప్రియాంక గాంధీలు కలిసి భోజనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో ఫోన్ కాల్ రావడంతో సోనియా మాట్లాడారు. అమేథీ ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ 2.37 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని ఆ కాల్ ద్వారా కుటుంబీకులు తెలుసుకున్నారు. ఈ వీడియోపై కంగనా స్పందిస్తూ.. చివరి వరకు మేనకా గాంధీ అక్కడే ఉండి ఇందిరా గాంధీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. గాయపడిన చిన్నపిల్లలా అత్త నుంచి ఓ చిన్న చిరునవ్వు లేదా ఆప్యాయతతో కూడిన చూపు కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తున్నారని, కానీ అలాంటిదేమీ జరగకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

సోనియాపై ‘‘మిస్టీరియస్ ఫారినర్’’ వ్యాఖ్యలు..

విదేశాల్లో ఓ కేఫ్‌లో రాజీవ్ గాంధీని కలినప్పటి నుంచి ఆయనతో విడదీయలేని బంధం ఏర్పడిందని కంగనా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత గాంధీ కుటుంబంలోని అందరూ ఓ ‘‘మిస్టీరియస్ ఫారిన్ నేషనల్’’ చుట్టూ తిరుగుటన్నట్లు ఉందని వియమర్శించారు. సంజయ్ గాంధీకి ఇందిరా గాంధీ రాజకీయ శిక్షణ ఇస్తున్న సమయంలోనే మరణించారని, భర్తను కోల్పోయిన తర్వాత మేనకను కుటుంబం నుంచి బయటకు పంపించారని కంగనా ఆరోపించారు. ఆ కొంత కాలానికే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు హత్యకు గురయ్యారని, చివరకు సోనియా గాంధీ ప్రభుత్వానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నారని కంగనా అనుమానాలు వ్యక్తం చేశారు.