BJP vs Congress: సిక్కు వ్యతిరేక అల్లర్ల రోజే ర్యాలీ ఎందుకు.? రాహుల్‌ను ప్రశ్నించిన జేపీ నడ్డా!

  • సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన ఈ రోజే ర్యాలీ ఎందుకు..?
  • ఇండియా కూటమి ర్యాలీని ప్రశ్నించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా..
Jp Nadda

Jp Nadda

BJP vs Congress: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇదంతా ఒక రాజకీయ నాటకమని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశంలో అరాచకం సృష్టించి, ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు ప్రతిపక్షాలు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. భారత్ ‘‘బనానా రిపబ్లిక్’’ కాదనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలని అన్నారు. దేశంలో ఇష్టానుసారం అల్లర్లు సృష్టించలేరని వ్యాఖ్యానించారు. రామ్‌లీలా మైదాన్‌లో జరుగుతున్నది ప్రజాస్వామ్య గౌరవం కాదని, ప్రజాస్వామ్యం పేరుతో అరాచాన్ని వ్యాప్తి చేస్తే ఉద్దేశపూర్వక ప్రయత్నమని అన్నారు. పదే పదే తిరస్కరణకు గురైన నాయకులే ఈ రాజకీయ నాటకానికి తెరతీశారని ఎద్దేవా చేశారు.

అబద్ధాలు చెప్పడం, గందరగోళం సృష్టించడం, వీధుల్లో అరాచకం, అశాంతిని ప్రేరేపించడం, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, విదేశీ శక్తుల ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని అస్థిరపరచడం రాహుల్ గాంధీ ఉద్దేశమని నడ్డా ఆరోపించారు. 1984 నవంబర్ 1 సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన రోజే ఈ ర్యాలీని రాహుల్ గాంధీ నిర్వహించడం వెనక ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆ రోజున అమాయక సిక్కుల్ని ఊచకోత కోశారన్నారు. వేలాది మంది కుటుంబాలు నిరాశ్రయులయ్యారని, పెద్ద సంఖ్యలో మహిళలు తమ భర్తల్ని కోల్పోయారని పేర్కొన్నారు. సిక్కు సమాజానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబం మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పలేదని ఆరోపించారు.

ధన్‌తేరాస్, దీపావళి, ఛత్ పూజ వంటి పండగల సమయంలో చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారుల ఆదాయాన్ని దెబ్బతీయడాన్ని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని నడ్డా అన్నారు. సెంట్రల్ ఢిల్లీలోని చాందినీ చౌక్, సదర్ బజార్, ఖారీ బౌలీ, కరోల్ బాగ్ వంటి మార్కెట్లలో పెద్ద సంఖ్యలో చిన్న వ్యాపారులు ఉన్నారని, ఇలాంటి కార్యక్రమాల వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటోందని అన్నారు.