NTV Telugu Site icon

JP Nadda: మోడీ కేబినెట్‌లోకి జేపీ నడ్డా.. బీజేపీకి కొత్త చీఫ్..

Jpnadda

Jpnadda

JP Nadda: చారిత్రాత్మక ఘట్టాని సమయం ఆసన్నమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 7.15 గంటలకు మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. మోడీతో పాటు ఆయన కేబినెట్‌లో చేరబోతున్న ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రిపదవులు దక్కిన వారికి సమాచారం వెళ్లింది. వారంతా ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భారత మిత్రదేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, మారిషస్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, సీషెల్స్ వంటి దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు.

ఇదిలా ఉంటే, బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మోడీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు మొత్తం 30 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో జేపీ నడ్డా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014-2019లో నరేంద్రమోడీ తొలి ప్రభుత్వంలో నడ్డా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ చూశారు. 2020లో అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాను బీజేపీ జాతీయాధ్యక్షుడిగా చేశారు. సెప్టెంబర్ 2022లో నడ్డా పదవీకాలం ముగిసినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు పొడగించారు. ఇదే జరిగితే బీజేపీకి కొత్తగా జాతీయాధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది.

మోడీ 3.0 కేబినెట్‌లో ఈ సారి మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేనలకు ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీకి చెందిన కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, జెడి(యు) నుండి లల్లన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్‌లు నేడు ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన జయంత్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ ఆర్‌వి చిరాగ్ పాశ్వాన్, శివసేనకు చెందిన ప్రతాప్ రావ్ జాదవ్, హెచ్‌ఎఎం జితన్ రామ్ మాంఝీ, ఎజెఎస్‌యుకు చెందిన చంద్ర ప్రకాష్ చౌదరి, ఆర్‌పిఐకి చెందిన రాందాస్ అథవాలే, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్, జేడీఎస్ నుంచి కుమారస్వామిలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయి.