రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు భాజపా అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి కోసం ముమ్మర కసరత్తు చేస్తున్న తరుణంలో వెంకయ్యతో బీజేపీ పెద్దలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మోదీ-షా ద్వయం మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య పేరును ప్రకటించవచ్చనే ఊహాగానాలు దేశరాజధానిలో వినిపిస్తున్నాయి. ఉపరాష్ట్రపతిగా చేసిన వారు రాష్ట్రపతిగా పనిచేసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అదే సంప్రదాయాన్ని బీజేపీ కొనసాగిస్తే రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టవచ్చని రాజకీయ పండితులు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ అధిష్టానం ప్రకటన వెలువడేవరకు వేచి ఉండాల్సిందే.. బీజేపీ పెద్దల మనసులో ఏముందో చెప్పడం ఇప్పుడే సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే బీజేపీ పెద్దల ఆశలు నెరవేరలేదు. కచ్చితంగా అభ్యర్థిని నిలబెట్టాలనే ధృఢనిశ్చయంతో విపక్షాలు ఉన్నాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి నిలపనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసినట్లు సమాచారం.
Yashwant Sinha: టీఎంసీకి యశ్వంత్ సిన్హా రాజీనామా.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఆయనే!