TCS Job Scam: అవినీతి లేని చోటు లేదు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి మొదలుకొని ప్రైవేటు సంస్థల వరకు ఎక్కడ చూసిన అవినీతి జరుగుతూనే ఉంది. అయితే ప్రైవేటు సంస్థల్లో కొంత తక్కువగా ఉంటుందనేది వాస్తవం. భారత్‌లోని ప్రైవేటు సంస్థల్లో నమ్మకమైన సంస్థల్లో టాటా కంపెనీ ముందు వరుసలో ఉంటుంది. అలాంటి టాటా సంస్థకు చెందిన టీసీఎస్‌లో కూడా ఉద్యోగాల కల్పనలో అవినీతి జరిగినట్టు బయటికొచ్చింది. అవినీతిని సహించని సంస్థ యాజమాన్యం .. ఘటనపై విచారణ ఉరిపించి అందుకు బాధ్యులైన వారిని తొలగించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలు..
Read also: Sobhita Dhulipala : సరికొత్త లుక్ లో మెరిసిపోతున్న శోభిత..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థ. ఏటా ఈ కంపెనీలో సగటున 50 వేల మంది వరకు కొత్త ఉద్యోగులు చేరుతుంటారు. గత మూడేళ్లుగా ఇదే ధోరణి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 6 లక్షలకుపైగా ఉద్యోగులు ఉన్నారు. 46 దేశాల్లో 150కిపైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టీసీఎస్ అంటే విలువలతో కూడుకున్న కంపెనీ అన్న పేరుంది. ఇప్పుడు ఇంతటి ఐటీ కంపెనీలోలో సైతం అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. నియామక ప్రక్రియలో.. కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీ పడ్డట్లు తెలిసింది. సిబ్బంది నియామక సంస్థల (స్టాఫింగ్ ఫర్మ్స్) నుంచి కొందరు ఉద్యోగుల్ని నియమించుకునేందుకు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సంస్థ అంతర్గత విచారణకు ఆదేశించింది.
Read also: Himanta Biswa Sarma: భారత్ లోనే అనేక మంది “హుస్సేన్ ఒబామాలు”.. వివాదాస్పదమైన సీఎం వ్యాఖ్యలు
టీసీఎస్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు అక్కడ పని చేసే కొందరు పైస్థాయి అధికారులు లంచాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. జాబ్ ఆశించిన వ్యక్తుల నుంచి నేరుగా డబ్బులు తీసుకోకుండా, స్టాఫింగ్ కన్సల్టెన్సీ కంపెనీలు అంటే ఉద్యోగాలు ఇప్పించే మధ్యవర్తి సంస్థల నుంచి భారీ మొత్తాల్లో ముడుపులు అందుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ఒక విజిల్ బ్లోయర్ అంటే అక్రమాల గురించి హెచ్చరించే అజ్ఞాత వ్యక్తి ద్వారా వెలుగులోకి వచ్చింది. అతను ఈ విషయం గురించి TCS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌కు (COO) మెయిల్ చేశాడు. TCSలో రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (RMG) గ్లోబల్ హెడ్‌గా పని చేస్తున్న ES చక్రవర్తి, కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినందుకు బదులుగా స్టాఫింగ్ కంపెనీల నుంచి కొన్నేళ్లుగా కమీషన్ తీసుకుంటున్నారని విజిల్ బ్లోయర్ సంస్థకు తెలిపాడు. ఈ వ్యవహారం గురించి ఫిర్యాదు అందిన నేపథ్యంలో టీసీఎస్ అప్పటికప్పుడు ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని వారాల విచారణ అనంతరం.. రిక్రూట్‌మెంట్ హెడ్‌ను సెలవుపై పంపించింది టీసీఎస్. అదే విధంగా రీసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (RMG) నుంచి నలుగురు ఎగ్జిక్యూటివ్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మూడు సిబ్బంది నియామక సంస్థల్ని కూడా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఎంత మేరకు అవినీతి జరిగిందో సంస్థకు స్పష్టంగా తెలియనప్పటికీ.. ఈ స్కామ్‌లో ఉన్న వ్యక్తుల్లో ఒకరు కమీషన్ల ద్వారా సుమారు రూ.100 కోట్ల వరకు సంపాదించి ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. ఇక కంపెనీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తున్నప్పటికీ.. వాటిని పరిశోధించి పరిష్కరించేందుకు పటిష్టమైన వ్యవస్థలను కలిగి ఉందని టీసీఎస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. టీసీఎస్ ఆదాయం విషయానికి వస్తే గత ఏడాది 27.93 బిలియన్ డాలర్లుకుపైగా ఆదాయం వచ్చింది. ఇది భారత కరెన్సీలో రూ.2.30 లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇక మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షల 14 వేల 795గా ఉంది.
