Jitendra Singh: అమిత్ షా కాల్పులకు ఆదేశాలు ఇవ్వరు, మెజిస్ట్రేట్ ఇస్తారు: కేంద్రం క్లారిటీ..

  • కాల్పులకు ఆదేశించింది అమిత్ షానే..
  • లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
  • కాల్పులకు మంత్రి ఆదేశాలు ఇవ్వలేరని, మెజిస్ట్రేట్ ఇస్తారని కేంద్రం క్లారిటీ..
  • అసలు విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని స్పష్టం చేసిన కేంద్రం..
Rahul Gandhi

Rahul Gandhi

Jitendra Singh: లోక్‌సభలో యాంటీ-పేపర్ లీక్ బిల్లు, విద్యార్థి నిరసనలపై ప్రతిపక్షాలు ఎన్డీయే సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశాయి. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘర్షణల్లో అమిత్ షానే కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అయితే, కేంద్రం ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది. దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలని సవాల్ విసిరింది.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఖండించారు. పరిపాలన ఎలా పనిచేస్తుందో ప్రతిపక్ష నేతకు అవగాహన లేదని విమర్శించారు. ఏ పరిస్థితుల్లోనైనా కాల్పులకు ఆదేశాలు ఇవ్వగలిగే అధికారం మంత్రి వద్ద ఉండదని, కేవలం మెజిస్ట్రేట్ లేదా సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్‌లకు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరని ఆయన అన్నారు. విద్యార్థులపై ఎలాంటి కాల్పులు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ మాత్రమే ఉపయోగించారని, కాల్పులు జరగలేదని పేర్కొన్నారు.

అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విద్యార్థులపై జరిగిన దాడికి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి ఆదేశాలు ఇచ్చి ఉండాలి, లేదా అలాంటి చర్యల గురించి ఆయనకు తెలియకపోయి ఉండొచ్చని అన్నారు. మొదటి పరిస్థితుల్లో ఆయన బాధ్యత వహించాలని, ఆయనకు తెలియకపోతే మంత్రిగా ఆయన అసమర్థుడు అని అన్నారు. ఆయన సభకు వచ్చి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.