NTV Telugu Site icon

Jharkhand: రూ. 37 కోట్లు పట్టుబడిన కేసులో మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలం అరెస్ట్..

Minister Alamgir Alam

Minister Alamgir Alam

Jharkhand: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ రోజు అరెస్ట్ చేసింది. ఇటీవల మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సహాయకుడి ఇంట్లో ఏకంగా రూ. 37 కోట్ల నగదు బయటపడింది. ఈ కేసులో మంగళవారం ఆలమ్‌ని ఈడీ 9 గంటలు ప్రశ్నించింది. ఈ రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మే 6న, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడు జహంగీర్ ఆలం అపార్ట్మెంట్‌పై దాడి చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది.

Read Also: Mathew Thomas: ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం

గతేడాది అరెస్టైన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కే రామ్‌పై మనీలాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. ఈ శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. దాడిలో పట్టుబడిన నగదును లెక్కించడానికి అనేక కౌంటిగ్ మిషన్లు తెప్పించడం, గుట్టలుగా ఉన్న రూ. 500 నోట్లను లెక్కించడం ఇటీవల వైరల్ అయింది. 70 ఏళ్ల ఆలమ్‌ని మంగళవారం ఈడీ రాంచీ జోనల్ కార్యాలయంలో విచారించిన ఒక రోజు తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.