Site icon NTV Telugu

Pooja Singhal: మనీలాండరింగ్ కేసు.. ఐఏఎస్ అధికారిణి అరెస్ట్..

Pooja Singhal

Pooja Singhal

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను అరెస్ట్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్.. మంగళవారం 9 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత .. పూజా సింఘాల్ బుధవారం మళ్లీ విచారణకు హాజరయ్యారు.. ఇక, ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను సేకరించిన ఈడీ.. ఆ తర్వాత ఆమెను అరెస్ట్‌ చేసింది.. కాగా పూజా సింఘాల్‌.. ప్రస్తుతం జార్ఖండ్‌ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా ఉన్నారు.. కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటంతోపాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిధులను దారి మళ్లించారనే అభియోగాలున్నాయి.. దీంతో, రంగంలోకి దిగిన ఈడీ.. పూజా సింఘాల్ నివాసంతోపాటు ఆమె సన్నిహితుల ఇళ్లపై గత వారం ఏకకాలంలో దాడులు చేసింది.. కీలక ఆధారాలు సేకరించింది.

Read Also: Taj Mahal: మా స్థలంలోనే తాజ్‌ మహల్‌ కట్టారు..

అనుమానాస్పద నగదు లావాదేవీలు తనిఖీ చేసేందుకు గత మూడేళ్లుగా ఆమె లావాదేవీలను స్కాన్ చేస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆమెకు గతంలో ఉన్న ఆస్తులు.. ఇప్పుడు ఉన్న అన్ని ఆస్తుల వివరాలను కూడా ఏజెన్సీ స్కాన్ చేస్తోంది. ఇక, ఈడీ జరిపిన దాడుల్లో దాదాపు రూ.19 కోట్ల నగదు లభించింది. అది సింఘాల్ డబ్బు అని చెబుతున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఈడీ దర్యాప్తు చేస్తోంది.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఉదయం రాంచీ, చండీగఢ్, ముంబై, కోల్‌కతా, ముజఫర్‌పూర్, సహర్సాతో సహా 18 కంటే ఎక్కువ ప్రదేశాలలో ఫరీదాబాద్, గురుగ్రామ్‌, నోయిడాతో సహా ఎన్‌సీఆర్‌లోని అనేక ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ సమయంలో స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి బ్యాంకు అధికారులు, కరెన్సీ లెక్కింపు యంత్రాల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక, ఆ తర్వాత సీఏ సుమన్ కుమార్ ను శనివారం అరెస్టు చేసింది ఈడీ.. సుమన్ కుమార్‌ను ఐదు రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది.. పూజా సింఘాల్ 2007 నుంచి 2013 వరకు డిప్యూటీ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేసే సమయంలో ఆమె అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఈడీ అభియోగాలు మోపింది.

Exit mobile version