Jharkhand Political Crisis: జార్ఖండ్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సర్కారు నెగ్గింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా రాలేదు. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎమ్‌ఎమ్‌కు 30, కాంగ్రెస్‌కు 18, ఆర్జేడీకి 1, ఎన్సీపీకి 1, సీపీఐఎంఎల్‌కు ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీకి 26, ఏజేఎస్‌యూకు 2, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 41 కాగా జేఎంఎం కూటమికి 48 ఓట్లు అనుకూలంగా వచ్చాయి.
విశ్వాస పరీక్ష సందర్భంగా బీజేపీపై హేమంత్ సోరెన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని సాధించేందుకు అల్లర్లకు ఆజ్యం పోయడం ద్వారా దేశంలో “అంతర్యుద్ధం లాంటి పరిస్థితి”కి బిజెపి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు బట్టలు, రేషన్, కిరాణా కొంటారని మనం విన్నాం. కానీ బీజేపీ మాత్రమే శాసనసభ్యులను కొనుగోలు చేస్తుందని.. దేశ తొలి గిరిజన రాష్ట్రపతిని నియమించిన తర్వాత గిరిజన ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆదివారం అక్కడి నుంచి రాంచీలోని బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం సోమవారం బల పరీక్ష నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే రాయ్‌పూర్‌లో ఉన్న ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవడం విశేషం. తమ సంకీర్ణాన్ని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాల మధ్య సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్‌కు లేఖ రాయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే.
CPI-M to support TRS : మునుగోడులో వాళ్ళు కలిసి నడవడం అసాధ్యమేనా..?
ఒకవేళ సోరెన్ ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడితే, ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగలేరు. విశ్వాస పరీక్ష నెగ్గినా సొరేన్ మెడపై అనర్హత కత్తి వేలాడుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేరు మీద గనుల తవ్వకం లీజు ఉందని, ఆయన లాభదాయక పదవిని నిర్వహిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఆరోపించారు. దాస్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఫిబ్రవరి 11న గవర్నర్ రమేశ్ బయిస్‌ను కలిసి, ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరింది. దీనిపై అభిప్రాయాన్ని తెలపాలని ఈసీఐని గవర్నర్ కోరారు. ఈసీఐ మొదట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చింది. సోరెన్‌కు మైనింగ్ లీజ్ మంజూరుకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ పత్రాలన్నిటినీ పరిశీలించిన తర్వాత మే 2న సోరెన్‌కు నోటీసు ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఈసీఐ ధర్మాసనం సమక్షంలో బీజేపీ, సోరెన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సోరెన్ తరపు న్యాయవాదుల వాదనలు ఆగస్టు 12తో ముగిశాయి. బీజేపీ ఆగస్టు 18న ఓ రిజాయిండర్‌ను సమర్పించింది. సొరేన్ అనర్హతపై ఈసీఐ ఇప్పటికే గవర్నర్‌కు నివేదిక పంపించింది. సొరేన్‌పై వేటు తప్పదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
