Jayalalithaa Death Probe-Justice Arumughaswamy commission submits its 590-page report to CM MK Stalin: జయలలిత మరణంపై తుది విచారణ నివేదికను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు సమర్పించింది జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్. 590 పేజీల తుది నివేదికను ఈ రోజు సీఎం స్టాలిన్ కు సమర్పించారు. జయలతిత మృతి నివేదికతో చెన్నైలోని సెక్రటేరియట్ వెళ్లిన జస్టిస్ అరుముగస్వామి ఈ నివేదికను స్టాలిన్ కు అందించారు. దివంగత మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు రావడంతో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం జస్టిస్ ఆరుముగస్వామి కమిటీని నియమించింది. ఈ కమిటీకి సహాయం చేయడానికి ఎయిమ్స్ డాక్టర్ల ప్యానెల్ ను కూడా నియమించింది సుప్రీంకోర్టు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016 సెప్టెంబర్ 22న హఠాత్తుగా జయలలిత అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలోని ఆయారవిలక్కు అపోలో ఆస్పత్రిలో చేరారు. దాదాపుగా 75 రోజుల పాటు చికిత్స పొందిన జయలలిత డిసెంబర్ 5న మరణించారు. జయలిత మరణంలో మిస్టరీ ఉందని.. విచారణ చేయాలని డిమాండ్ చేశారు అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి సెప్టెంబర్ 25,2017న హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ అరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. విచారణ మూడు నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. అయితే దాదాపుగా ఐదేళ్ల తరువాత ఈ విచారణ నివేదిక పూర్తి అయింది. ఇటీవల ఎయిమ్స్ డాక్టర్ల ప్యానెల్ కూడా జయలలితకు వైద్య విధానాల ప్రకారమే చికిత్స జరిగిందని.. చికిత్సలో ఎలాంటి లోపం లేదని రిపోర్టు ఇచ్చింది.
Read Also: JP Nadda – Nithin meet: జేపీ నడ్డాతో నితిన్ భేటీ.. ఇలా స్పందించిన బీజేపీ నేత
అరుముగస్వామి కమిషన్ పన్నీర్ సెల్వంతో పాటు మాజీ మంత్రులు, జయలలిత, శశికళ బంధువులు, సెక్యూరిటీ గార్డులు, పోయెస్ గార్డెన్ సిబ్బంది, జయలలితకు వైద్యం చేసిన అపోలో ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇలా దాదాపుగా 158 మందిని విచారించింది. వివిధ కారణాల వల్ల ఈ కమిషన్ కాలపరిమితిని 14 సార్లు పొడగించింది తమిళనాడు సర్కార్. 590 పేజీల తుది నివేదికను తమిళం, ఇంగ్లీష్ రెండు భాషల్లో రూపొందించారు. జయలలిత మరణంపై విచారణకు సంబంధించి ముఖ్యమైన అంశాలను వివరిస్తూ 200 పేజల ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. జయలలిత ఆస్పత్రిలో చేరకముందు ఆరోగ్య పరిస్థితులు.. అపోలో ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆమె పరిస్థితి మెరుగవ్వకపోవడాకి కారణం ఏమిటి..? చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్తే బతికేదా..? లేక మరణానికి మరేదైనా కారణాలు ఉన్నాయా..? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలను నివేదికలో పొందుపరిచినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు ప్రభుత్వం ఈ నివేదికను అసెంబ్లీలో సమర్పించి చర్చించే అవకాశం ఉంది.