NTV Telugu Site icon

Jaya Bachchan: లోక్‌సభ ఘటనపై జయా బచ్చన్ హాట్ కామెంట్స్.. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వ్యాఖ్య

Jayabachchan

Jayabachchan

పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు. రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి డైవర్ట్ చేసేందుకే బీజేపీ ఎంపీలు దాడి అంటూ డ్రామాలాడారని ఆరోపించారు.

రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ఈ మధ్య కొందరికీ అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని.. ఆయన పేరు తలుచుకునే బదులు.. భగవంతుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో పుణ్యమైన దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలంటూ గురువారం విపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ప్రతిగా అధికార పార్టీ ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డాయి. అయితే ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తోసేయడం వల్లే తమకు దెబ్బలు తగిలాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది.

తాజాగా ఇదే అంశంపై జయా బచ్చన్ మీడియాతో మాట్లాడారు. తాము పార్లమెంట్‌లోకి వెళ్తుంటే.. అధికార బీజేపీ ఎంపీలే అడ్డుకుని తమపై దాడి చేశారన్నారు. కానీ బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్ మాత్రం డ్రామా చేస్తున్నారని.. వారి నటనకు అవార్డులు ఇవ్వాలన్నారు. కేవలం అమిత్ షా వ్యాఖ్యల నుంచి డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామా ఆడారని తెలిపారు. ఇక నాగాలాండ్ బీజేపీ మహిళా ఎంపీ కోన్యాక్.. రాహుల్‌పై చేసిన ఆరోపణలకు కూడా అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కావాలనే ఉద్దేశ పూర్వకంగా మహిళా ఎంపీ ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. రోజురోజుకి ఎంపీల నుదిటపైన చిన్న కట్టు.. పెద్ద కట్టుగా మారిపోతుందని పేర్కొన్నారు. అయినా ఐసీయూలో ఉన్న వ్యక్తులు మాట్లాడడం తానెప్పుడూ చూడలేదన్నారు. తన జీవితంలో ఇదొక పెద్ద డ్రామా అంటూ జయా బచ్చన్ అభివర్ణించారు.

జయా బచ్చన్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. ఇండియా కూటమి యొక్క నిజమైన సంస్కృతి బయటపడిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా అన్నారు. గిరిజన మహిళా ఎంపీకి మద్దతు ఇవ్వాల్సింది పోయి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. గిరిజన సమాజం పట్ల ఇండియా కూటమికి గౌరవం లేదన్నారు.

 

Show comments