వరదలు, భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ ( జేఈ ) వ్యాధి కలవరపెడుతోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపుకు కారణం అవుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధితులు బాధపడుతుంటారు. సరైన సమయంలో వైద్యం అందకపోతే వ్యాధి చికిత్సకు లొంగే పరిస్థితి ఉండదు. తాజాగా ఈ వ్యాధి అస్సాం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతోంది.
ఇప్పటి వరకు జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి కారణంగా 15 రోజుల్లో 23 మంది చనిపోయారని జాతీయ ఆరోగ్య మిషన్ శుక్రవారం వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగా శుక్రవారం మరో నలుగురు మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కేసులు నమోదు అయ్యాయి. బార్ పేట, కామరూప్ మెట్రోపాలిటిిన్, కర్బీ అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్ ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదు అవ్వగా..నాగావ్ లో 4, శివసాగర్ లో రెండు, నల్బరీ, ఉదల్ గురి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయినట్లు నేషనల్ హెల్త్ మిషన్ వెల్లడించింది. జూలై 1 నుంచి అస్సాంలో ఇప్పటి వరకు మొత్తం 160 కేసులు నమోదు అయ్యాయి.
Read Also: Telangana Floods: రేపు తెలంగాణ గవర్నర్ తమిళసై భద్రాచలం పర్యటన
గత నెలలో అస్సాంలో భారీగా వర్షాలు, వరదలు సంభవించాయి. 28 జిల్లాల్లో ప్రజలు వీటి వల్ల ప్రభావితం అయ్యారు. చాలా రోజుల వరకు గ్రామాలు నీటిలో ఉన్నాయి. దీంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. దీంతోనే దోమల పెరగడం జేఈ వ్యాధి విస్తరణకు కారణం అయినట్లుగా తెలుస్తోంది. వ్యాధి వ్యాపించకుండా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ఫాగింగ్ కార్యక్రమాలు, దోమ తెరలను పంపిణీ చేస్తున్నారు అధికారులు.
జేఈ ఇన్ఫెక్షన్ కు ప్రధానంగా దోమలు కారణం అవుతాయి. వ్యాధికారక ఫ్లావీవైరస్ ను పందుల నుంచి మనుషులకు వ్యాపింప చేస్తుంది. దోమలు కుట్టడం ద్వారా మనుషులు, ఇతర జంతువుల శరీరాల్లోకి వైరస్ చేరుతుంది. ఫలితంగా జేఈ వ్యాధి వస్తుంది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్, మెదడు, వెన్నుపాముపై ప్రభావాన్ని చూపిస్తుంది. త్వరగా వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోకుంటే మరణం సంభవిస్తుంది.