Kashmiri Pandit shot dead by terrorists in jammu kashmir: జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేస్తూ.. దుశ్చర్యకు పాల్పడ్డారు. కాశ్మీరీ పండింట్ ను కాల్చిచంపారు. ఈ ఘటన షోఫియాన్ జిల్లా చోటీపురా ఏరియాలో మంగళవారం జరిగింది. కాశ్మీరీ పండిట్లు సునీల్ కుమార్ భట్, అతని సోదరుడు పింటూ కుమార్ భట్ లపైకి టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సునీల్ కుమార్ భట్ చనిపోయారు. గాయపడిన పింటూ కుమార్ భట్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు కాల్పులు జరిగిన ప్రాంతాన్ని అదుపలోకి తీసుకున్నాయి. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు నిర్వహిస్తున్నారు.
Read Also: Tarun Chugh: బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్ఎస్ పాల్పడుతోంది
గత ఏడాది అక్టోబర్ నుంచి కాశ్మీర్ వ్యాప్తంగా మైనారిటీ హిందువులను టార్గెట్ చేస్తున్నారు ఉగ్రవాదులు. మైనారిటీలనే కాకుండా వలస కూలీలు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా హతమారుస్తున్నారు. ఇటీవల మే నెలలో బుద్గామ్ లో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ను ఉగ్రవాదులు ప్రభుత్వ కార్యాలయంలోనే హతమార్చారు. ఆ తరువాత హిందూ మహిళా ఉపాధ్యాయురాలని కాల్చిచంపారు. ఈ ఘటనలకు ముందు ప్రముఖ కాశ్మీరీ టీవీ నటి అమ్రీన్ భట్ ను కూడా టెర్రరిస్టులు కాల్చి చంపారు.
రాహుల్ భట్ ను హతమార్చిన ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టింది. అయితే రాహుల్ భట్ హత్య జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. హిందువులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. తమ భద్రత ప్రశ్నార్థకంగా ఉందని.. అప్పటి నుంచి దాదాపుగా 5 వేల మంది కాశ్మీరీ పండిట్లు ఉద్యోగాలకు హజరుకావడం లేదు. లష్కరే తోయిబా అనుబంధంగా ఉన్న ‘ ది రెసిస్టెంట్ ఫ్రంట్’ ఉగ్రవాద సంస్థ ఈ టార్గెటెడ్ దాడులకు పాల్పడుతోంది. సామాన్యులైన ప్రజలు, వలస కూలీలను టార్గెట్ చేస్తోంది.