Hybrid Terrorists Arrested In Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రిస్టులను అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ టెర్రర్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని ఆర్మీ, పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో అనంత్ నాగ్ జిల్లా వాఘామా-ఓప్జాన్ రోడ్‌లో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలోనే ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు.
అరెస్ట్ అయిన ఉగ్రవాదులను తన్వీర్ అహ్మద్ భట్, తుఫైల్ అహ్మద్ దార్ లుగా గుర్తించారు. వీరిద్దరు అనంత్ నాగ్ జిల్లా వాఘామా బిజ్ బెహరా, మిడోరా ట్రాల్ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఇద్దరి వద్ద నుంచి రెండు పిస్టల్స్, రెండు మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వీరిని విచారిస్తున్నారు.
Read Also: Karnataka: రూ. 9 వేల కోసం వ్యక్తి దారుణ హత్య
ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో సంగల్దాన్, గూల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఆదివారం భద్రతా బలగాలు ఛేదించాయి. చైనా ఆయుధాలతో పాటు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు 72 మంది టెర్రరిస్టులను అరెస్ట్ చేయగా..151 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
కాశ్మీర్ ప్రాంతంలో ఇటీవల కాలంలో హైబ్రిడ్ టెర్రరిజం పెరుగుతోంది. పెద్ద పెద్ద దాడులు చేయకుండా, ప్రజల్లో భయపుట్టించే విధంగా ఉగ్రవాదులు, సామాన్యప్రజల్ని టార్గెట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలుగా వచ్చి.. సాధారణ ప్రజలే లక్ష్యంగా కాల్చి చంపుతున్నారు. నాన్ లోకల్స్, హిందువులు, పండిట్లు, భారత దేశానికి మద్దతుగా ఉండేవారిని టార్గెట్ చేస్తూ చంపుతున్నారు. గతంలో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిత్ పాటు టీవీ ఆర్టిస్ అమ్రీన్ భట్, బ్యాంకు మేనేజర్, హిందూ మహిళా ఉపాధ్యాయురాలిని.. పలువురు కూలీను చంపారు. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తర్వాత భద్రతా బలగాలు, కాశ్మీర్లో ఉగ్రవాదులను వరసగా మట్టుపెడుతున్నారు. దీంతో హైబ్రిడ్ టెర్రరిజాన్ని తీవ్రవాదులు వ్యాప్తి చెస్తున్నారు.
