NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం

Kashmir

Kashmir

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా క్రీరి ప్రాంతంలోని నాజీబాత్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం అయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంలో భద్రతా బలగాలు కార్డర్ సెర్చ్ ను ప్రారంభించాయి. ఇదే సమయంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య కాల్పులు జరగడంతో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ లో ఒక పోలీస్ అధికారి కూడా అమరుడయ్యారు.

హతమైన ఉగ్రవాదులను జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. గత నాలుగు నెలలుగా వీరు యాక్టివ్ ఉన్నట్లు జమ్మూ కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఎన్ కౌంటర్ ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలో 60 మందికి పైగా పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వీరందరిని ఏరేసే పనిలో భద్రతా బలగాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్ కౌంటర్ కు ఒక రోజు ముందు 8 మంది తీవ్రవాదులకు సహకరిస్తున్న వారిని భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. అవంతిపోరాలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ టెర్రర్ మాడ్యుల్ ను భద్రతా బలగాలు చేధించాయి. వారి వద్ద నుంచి మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు. అయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు ఉగ్రవాదులు సామాన్యులను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఉద్యోగి అయిన కాశ్మీరీ పండిత్ రాహుల్ భట్ ను కాల్చి చంపారు టెర్రరిస్టులు. అయితే తమకు భద్రత కల్పించాలంటూ పండిట్లు కాశ్మీర్ అంతటా నిరసనలు తెలుపుతున్నారు.

Show comments