Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ నిలిపేసింది. ఇప్పటికే, ఈ ఒప్పందాన్ని నిలిపేయడంపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. అయితే, భారత్ వీటిన్నింటిని పట్టించుకోకుండా సింధు, దాని ఉపనదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్‌లోని రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులైన రాటిల్, దుల్ హస్తి ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని పెంచాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఉన్న అడ్డంకుల్ని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Balochistan: ‘‘దమ్ముంటే క్వెట్టా దాటి బయటకు రండి’’.. పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..
జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటల్ దల్లూ కిష్ట్వార్ జిల్లాలోని రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు ప్రాజెక్టులపై పాకిస్తాన్ పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే, ఈ ప్రాజెక్టులు ఇండస్ వాటర్ ట్రీటీకి అనుగుణంగా ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విద్యుత్, ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని భారత్ వాదించింది. అయితే, ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంతో పాకిస్తాన్ అభ్యంతరాలను పట్టించుకునే పరిస్థితి లేనే లేదు.
850 మెగావాట్ల రాటిల్ జలవిద్యుత్ ప్రాజెక్టు, 390 మెగావాట్ల దుల్ హస్తి జలవిద్యుత్ కేంద్రాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. రాటిల్, దుల్ హస్తి ప్రాజెక్టులతో పాటు, కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై మరో రెండు జల విద్యుత్ కేంద్రాలు కూడా పురోగతిలో ఉన్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని బలిగొన్న తర్వాత, భారత్ 1960 నాటి ఈ ఒప్పందాన్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది.
