Site icon NTV Telugu

Waqf Bill: మైనారిటీలను చెడుగా చూపాలని బీజేపీ వ్యూహం.. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ నేత..

Waqf Bill

Waqf Bill

Waqf Bill: బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న ‘‘వక్ఫ్ బిల్లు’’పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని, మైనారిటీలను చెడుగా చూపిస్తుందని బీజేపీపై విమర్శలు చేశారు. ముస్లింలు వారి మతపరమైన సంప్రదాయాలను నిర్వహించే హక్కుని కోల్పోవడంతో పాటు వక్ఫ్ పరిపాలనను బలహీన పరచడం వంటి లోపాలు బిల్లులో ఉన్నాయని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసి, మైనారిటీలను చెడుగా చూపించడమే బీజేపీ వ్యూహమని అన్నారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు.

‘‘ వక్ఫ్ సవరణ బిల్లు-2024 అనేది బీజేపీ వ్యూహంలో భాగం. మన ప్రత్యేకమైన బహుళ మత సమాజంలో శతాబ్ధాల నాటి సామాజిక సామరస్య బంధాలను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోంది. పక్షపాతాలను సృష్టిస్తోంది. తద్వారా వారిని చెడుగా చూపించడం, మతంతో సంబంధం లేకుండా పౌరుల సమాన హక్కులను, రక్షణ హామీలను ఇచ్చే రాజ్యాంగాన్ని నీరుగార్చడం’’ అని జైరాం రమేష్ అన్నారు.

Read Also: Salman Khan : సల్మాన్ ఖాన్ ’సికందర్’ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ అదుర్స్..

ఎన్నికల్లో లాభాల కోసం మన సమాజాన్ని, మైనారిటీ వర్గాల సంప్రదాయాలను, సంస్థల్ని కించపరిచడం బీజేపీ వ్యూహమని అన్నారు. ‘‘వక్ఫ్‌లను నిర్వహించడానికి మునుపటి చట్టాల ద్వారా సృష్టించబడిన అన్ని సంస్థల (జాతీయ మండలి, రాష్ట్ర బోర్డులు, ట్రిబ్యునళ్లు) అధికారాలు కోల్పోయేలా, ఉద్దేశపూర్వకంగా సమాజం తన స్వంత మత సంప్రదాయాలు, వ్యవహారాలను నిర్వహించుకునే హక్కును కోల్పోయేలా చురుకుగా ప్రయత్నిస్తున్నాయి’’ అని జైరాం రమేష్ అన్నారు. వక్ఫ్ భూముల్ని ఆక్రమించిన వారిని రక్షించడానికి ఇప్పుడు చట్టంలో రక్షణలు ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు.

‘‘వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలకు సంబంధించిన విషయాలపై కలెక్టర్, ఇతర నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వాటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన విస్తృత అధికారాలు ఇవ్వబడ్డాయి. తుది నిర్ణయం తీసుకునే వరకు ఎవరి ఫిర్యాదుపైనా లేదా వక్ఫ్ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అనే కేవలం ఆరోపణపైనా రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఇప్పుడు ఏదైనా వక్ఫ్ గుర్తింపును రద్దు చేసే అధికారాలను కలిగి ఉంటారు’’ అని ఆరోపించారు.

Exit mobile version