CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..

  • జైపూర్‌లో CJP స్కూల్ సందర్శనపై గ్రామస్థులతో ఘర్షణ
  • పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన CJP బృందం
  • తమపై దాడి చేశారని CJP ఆరోపణ
  • CJP బృందం తమను భయపెట్టిందని గ్రామస్థుల ఫిర్యాదు
Cjp Protest

Cjp Protest

CJP: రాజస్థాన్ ఓ గ్రామంలోని పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్తులు దాడి చేశారు. శుక్రవారం సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు ఆయనతో ఉన్న వారిపై దాడి జరిగింది. ఈ ఘటనపై రెండు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. జైపూర్ లోని రాంపూరా కన్వార్పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.తమపై దాడి చేశారని సీజేపీ ఆరోపిస్తోంది.

అయితే, గ్రామస్తులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు. సీజేపీ బృందం పెద్ద సంఖ్యలో గ్రామంలోకి రావడంతో భయాందోళన వాతావరణం ఏర్పడిందని, తమను బెదిరించారని ఆరోపించారు. ఈ సంఘటనపై శివదాస్‌పురా పోలీస్ స్టేషన్ అధికారి రాజేష్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి ఓ గ్రామస్తుడు ఫిర్యాదు చేశాడని, సీజేపీ బృందం పెద్ద సంఖ్యలో గ్రామానికి వచ్చి భయపెట్టారని, పిల్లలు కూడా భయపడి పాఠశాలకు హాజరుకావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో సీజేపీ కూడా తమపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.

సీజేపీ నేత అశుతోష్ రాంకా మాట్లాడుతూ.. తమపై దాడి చేసిన వారు బీజేపీ గుండాలని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. గ్రామానికి చేరుకున్న తర్వాత బీజేపీ కార్యకర్తలతో కలిసి కొందరు గ్రామస్తులు బారికేడ్లు ఏర్పాటు చేసి తమను అడ్డుకున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం పాఠశాల భవనం మరమ్మతులకు ఇప్పటికే నిధులు కేటాయించిందని గ్రామస్తులు వెల్లడించారు.