పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా సయీద్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరై 1989 నాటి కిడ్నాప్‌కు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ కేసులో రుబయ్యా సయీద్ తొలిసారిగా కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ ఆగస్టు 23న జరగనుంది. ఆ తేదీన కూడా హాజరు కావాలని రుబయ్యాకు కోర్టు ఆదేశించింది.
మెహబూబా ముఫ్తీ సోదరి రుబయ్యా సయీద్‌ను డిసెంబర్ 8, 1989న జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) తీవ్రవాదులు అపహరించారు. తీవ్రవాద నిధుల కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న యాసిన్ మాలిక్, ఇతరులకు ఈ కేసులో సంబంధం ఉంది. “ఈరోజు కోర్టులో సాక్షి రుబయ్యా సయీద్ వాంగ్మూలం నమోదు చేయబడింది. ఆమె యాసిన్ మాలిక్‌ను గుర్తించింది. తదుపరి విచారణ ఆగస్టు 23న ఉంది. ఆమె మొత్తం నలుగురు నిందితులను గుర్తించింది” అని సీబీఐ న్యాయవాది మోనికా కోహ్లీ తెలిపారు.
Supreme Court: సుప్రీంకోర్టు పనివేళలు మారతాయా?.. సీనియర్ జడ్జి కీలక వ్యాఖ్యలు.
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా యాసిన్ మాలిక్ ఈరోజు కూడా ఈ కేసులో హాజరయ్యాడని సీనియర్ న్యాయవాది, పీడీపీ అధికార ప్రతినిధి అనిల్ సేథీ వెల్లడించారు. ఈ కేసులో భౌతికంగా జమ్మూలో హాజరు కావాలని కూడా అభ్యర్థించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో ఎన్‌ఐఏ కోర్టు ఈ ఏడాది మేలో వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధించింది. మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. అతనికి రెండుసార్లు జీవిత ఖైదు పడింది. మే 19న దోషిగా తేలిన వేర్పాటువాద నేతకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ కోరింది.