PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) రగిలిపోతోంది. గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. దీంతో అక్కడ భద్రతా బలగాలు, ప్రజలకు మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ చేతుల నుంచి జారిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఆజాదీ నినాదాలతో పెద్ద ఎత్తు వీధుల్లోకి వస్తున్నారు. నిరసనల్లో భారత్ జెండాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు పాకిస్తాన్‌లో భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఇటీవల రావల్‌కోట్‌లో భారత్‌లో తమని విలీనం చేయాలని పోస్టర్లు వెలువడిని తర్వాత నిరసనకారులపై దాడి జరిగింది.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, పీఓకే వనరులను అక్కడి ప్రజలకు కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు పాక్ ప్రభుత్వం తరలించుకుపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. చివరకు గోధుమల వంటి నిత్యావసరాలను కూడా పాక్ ప్రభుత్వం పీఓకే ప్రజలకు సక్రమంగా ఇవ్వలేకపోతోంది. మరోవైపు విద్యుత్ ఛార్జీలపై పన్నులు అక్కడి ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. పీఓకేలోని హైడల్ పవర్ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ని పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలు, నగరాలకు తరలించుకుపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. ఈ నిరసనల్ని అణిచివేసేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై పట్టుకోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Yogi Adityanath: “అతను ఎలాగైనా చావాల్సిందే”.. గ్యాంగ్‌స్టర్ అన్సారీ మరణంపై సీఎం యోగి కామెంట్స్..
మిలిటరీ ఇంటెలిజెన్స్ వాహనాలను, పోలీస్ వాహనాలను నిరసనకారులు తగలబెడుతున్నారు. పీఓకేలోని దద్యాల్ ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజల పైకి టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఇద్దరు మైనర్ బాలికలు మరణించారు. దీంతో నిరసనలు మరింత పెద్దవిగా మారాయి. మానవహక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పదిజిల్లాల్లో నిరసనలు పెరిగాయి. ఫిబ్రవరిలో పాక్ ప్రభుత్వం, పీఓకీ కుదిరిన ఒప్పందంపై కట్టుబడి లేనందుకు జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ‘‘షటర్-డౌన్, వీల్-జామ్’’ సమ్మెలకు పిలుపునిచ్చింది.
మరోవైపు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ నేతలు త్వరలోనే పీఓకే భారత్‌లో భాగంగా మారుతుందని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిరసనలు ఆసక్తికరంగా మారాయి. భారత్‌లోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని ప్రజలకు భారత ప్రభుత్వం అన్ని వసతులు, రేషన్, కరెంట్ వంటివి అందిస్తుందనే విషయం పీఓకే వాసుల్లో భారత్‌పై ఆసక్తి పెరిగేందుకు సాయపడుతోంది. పీఓకేలోని చాలా మందికి జమ్మూ కాశ్మీర్‌తో సంబంధబాంధవ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన కాశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, పాక్ ప్రభుత్వం తమను ఎలా ట్రీట్ చేస్తుందనే దానిపై అక్కడి ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. పీఓకేతో పాటు గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో కూడా ఉద్యమం ఎగిసిపడుతోంది. భారత్‌లో తమను చేర్చుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
