Site icon NTV Telugu

Amit Shah: ఆయన ముఖ్యమంత్రా..? కేజ్రీవాల్‌కి పైలెట్‌గా పనిచేస్తున్నారా..?

Amit Shah

Amit Shah

Amit Shah: పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పంజాబ్ గురుదాస్ పూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను టార్గెట్ చేశారు. భగవంత్ మాన్ రాష్ట్రానికి సమయాన్ని కేటాయించడం లేదని, అరవింద్ కేజ్రీవాల్ దేశ పర్యటనలకు రాష్ట్రవిమానాన్ని తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నాడని ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రా..? లేక పోలే కేజ్రీవాల్ పైలెటా..? అని ప్రశ్నించారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజెపి ప్రచారంలో భాగంగా పంజాబ్‌లోని గురుదాస్ పూర్ లో జరిగిన ర్యాలీలో షా పాల్గొన్నారు. నా మొత్తం జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని, ఆప్ తప్పుడు హామీలు ఇస్తోందని విమర్శించారు. కేజ్రీవాల్ చెన్నై వెళ్తే అక్కడికి, కోల్‌కతాకు వెళ్లవలసి వస్తే అక్కడికి విమానాన్ని తీసుకెళ్లడమే భగవంత్ మాన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ పర్యటనకే మొత్తం రాష్ట్ర ఖజానా ఖర్చవుతోందని దుయ్యబట్టారు. పంజాబ్ శాంతిభద్రతలు ప్రమాదకరంగా మారాయని, ఇక్కడి ప్రజలు సురక్షితంగా లేరని అమిత్ షా అన్నారు.

Read Also: Money Laundering Case: 400 కోట్ల మనీలాండరింగ్ కేసులో అన్నదమ్ములిద్దరూ అరెస్ట్..!

పంజాబ్ లో డ్రగ్స్ వ్యాపారం పెరుగుతోందని, రైతుల సమస్యలు పట్టించుకునే సమయం సీఎంకు లేదని అన్నారు. ఆప్ ప్రభుత్వం పంజాబ్ లో ప్రతీ మహిళకు రూ. 1000 ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని ముప్పు నుంచి విముక్తి చేయాలని నిర్ణయించిందని, త్వరలో పంజాబ్‌లో మాదకద్రవ్యాల వ్యాపారానికి తెరపడుతుందని అన్నారు. నెల రోజుల్లో అమృత్‌సర్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 300 కంటే ఎక్కువ సీట్లతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నుకోవాలని, ప్రధాని మోదీని మళ్లీ ప్రధానిని చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేజ్రీవాల్ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడం, దేశవ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం వార్తా పత్రికల్లో ప్రకటనలివ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ.. పంజాబ్ నిధులతో గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వడం ఏంటని ఆయన నిలదీశారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీజేపీ నేతలు విజయ్ రూపానీ, మన్ ప్రీత్ సింగ్ బాదల్, సునీల్ జాఖర్, అశ్వనీ శర్మ, మనోరంజన్ కాలియా తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version