NTV Telugu Site icon

Internet Users In India: భారత్‌లో 90 కోట్లను దాటనున్న ఇంటర్నెట్ యూజర్లు.. గ్రామీణులదే ఆధిపత్యం..

Internet Users In India

Internet Users In India

Internet Users In India: భారతదేశంలో రికార్డు స్థాయిలో ఇంటర్నెట్ యూజర్లు పెరుగుతున్నారు. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లను దాటుతుందని గురువారం ఒక నివేదిక వెల్లడించింది. డిజిటల్ కంటెంట్ కోసం దేశంలోని ప్రాంతీయ భాషల వినియోగం పెరుగుతుండటం ఇంటర్నెట్ యూజర్ల పెరుగుదలకు కారణంగా ఉందని చెప్పింది. ఇండియాలో 2024 నాటికి ఈ సంఖ్య 88.6 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం బలమైన వృద్ధిని సూచిస్తుంది.

ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) మరియు కాంటార్ నివేదిక ప్రకారం, 488 మిలియన్ల వినియోగదారులతో గ్రామీణ భారతదేశం ఈ వృద్ధికి నాయకత్వం వహిస్తుంది. మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో గ్రామీణ వినియోగదారులు 55 శాతం వాటాని కలిగి ఉన్నారు. దాదాపుగా అందరు యూజర్లు, అంటే 98 శాతం మంది భారతీయ భాషల్లో కంటెంట్‌ని యాక్సెస్ చేశారు. తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో విస్తృతమైన కంటెంట్ ఉండటం కారణంగా అత్యంత ప్రజాదరణ లభిస్తోంది.

Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దుండగుడి గుర్తింపు.. ఎలా ఇంట్లోకి వచ్చాడంటే..?

పట్టణ ఇంటర్నెట్ యూజర్లలో సగానికి పైగా అంటే, 57 శాతం మంది ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ని ఇష్టపడుతున్నారు. ఇది అన్ని ప్లాట్‌ఫారమ్స్‌లో స్థానిక భాష కంటెంట్‌కి పెరుగుతున్న డిమాండ్‌ని చూపిస్తోందని నివేదిక పేర్కొంది. గతేడాది నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గేమ్ ఛేంజర్‌గా మారింది. ప్రతీ 10 మంది ఇంటర్నెట్ యూజర్లలో 9 మంది ఏఐ ఎంబెడెడ్ కలిగిన యాప్స్‌ని వాడుతున్నారు.

“AI చుట్టూ ఉన్న విస్తృత ఆమోదం, ఉత్సాహం భారతదేశంలో మరిన్ని నెక్ట్స్ జనరేషన్ AI లక్షణాలను ప్రవేశపెట్టడానికి డిజిటల్ కంపెనీలను ప్రోత్సహించాలి” అని కాంటార్ ఇన్‌సైట్స్–దక్షిణాసియా B2B అండ్ టెక్నాలజీ డైరెక్టర్ బిశ్వప్రియ భట్టాచార్య అన్నారు. భారతదేశంలో జెండర్ గ్యాప్ కూడా తక్కుతోందని, మొత్తం ఇంటర్నెట్ యూజర్లలో 47 శాతం మంది మహిళలు ఉన్నారు.

ఓటీటీ వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్, ఆన్‌లైన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వినియోగం వంటి కార్యకలాపాలతో గ్రామీణ భారతం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ వర్గాలు పట్టణ వినియోగదారుల్ని మించిపోయారు. 2023 మరియు 2024 మధ్య 54 శాతం పెరిగిన స్మార్ట్ టీవీలు మరియు స్మార్ట్ స్పీకర్లు వంటి సాంప్రదాయేతర పరికరాల స్వీకరణలో అర్బన్ ఇండియా ముందుంది. ఇదే సమయంలో పట్టణ, గ్రామీణ జనాభాలో ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి మొబైల్ ఫోన్స్ అనేవి ప్రాథమిక మార్గంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.

Show comments