Congress: తమిళనాడులో కాంగ్రెస్ వర్గపోరు వీధిన పడింది. కాంగ్రెస్ కరూర్ ఎంపీ జోతిమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఒక వర్గంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఒక వర్గం కాచుకుని కూర్చుని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ఈ గడ్డపై సామాజిక న్యాయం, అభివృద్ధి విధానాలను పాతిపెట్టడానికి ఏ అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంది’’ అని ఆమె అన్నారు. ప్రజల సమస్యల గురించి వదిలిపెట్టి, వర్గపోరాటాల్లో నిమగ్నమై, తమిళనాడు కాంగ్రెస్ కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వినాశకర మార్గంలో పయనిస్తోందని ఆమె అన్నారు.
తమిళనాడు కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనల్ని కలిగిస్తున్నాయని, రోజు రోజు రాష్ట్ర కాంగ్రెస్ తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోందని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న గుర్తింపు, గౌరవం నెహ్రూ గాంధీ కుటుంబాలు చేసిన త్యాగాల నుంచి వచ్చాయని, రాహుల్ గాంధీ నిస్వార్థ, నిర్భయ రాజకీయాలకు పూర్తి వ్యతిరేక మార్గంలో పయనిస్తోందని చెప్పారు. రాహుల్ గాంధీ అవిశ్రాంత కృషిని, సాటిలేని త్యాగాలను మనం మోసం చేయలేము అని ఆమె అన్నారు.
పార్టీ డేటా వింగ్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తి, తమిళనాడు అప్పుల్ని బీజేపీ పాలిత యూపీతో పోల్చడం వివాదాస్పదమైంది. డీఎంకే ఎంపీ కనిమొళి తమిళనాడు అభివృద్ధిలో దూసుకుపోతుందనే సోషల్ మీడియా పోస్టుపై చక్రవర్తి ఈ విమర్శలు చేశారు. తమిళనాడును, యూపీతో పోల్చడం అన్యాయమని జోతిమణి అన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చక్రవర్తి కూడా స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గొంతును కాంగ్రెస్ లోపల ఎవరూ వినిపించడానికి తాము అనుమతించమని అన్నారు. ఈ వివాదం కాంగ్రెస్-డీఎంకే మిత్రపక్ష సంబంధాలపై ప్రభావం చూపుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే తమిళనాడులో బీజేపీ అవకాశంగా మార్చుకుని విమర్శలు చేస్తోంది.
