NTV Telugu Site icon

Inspirational News: కొడుకును ఆదర్శంగా తీసుకున్న తండ్రి. డాక్టర్ అయ్యేందుకు 55 ఏళ్ల వయసులో ‘నీట్’కి హాజరు

Rajyakkodi

Rajyakkodi

Inspirational News: సహజంగా తండ్రిని కొడుకు ఆదర్శంగా తీసుకుంటాడు. కానీ ఈ కథ వేరు. తండ్రే కొడుకు బాటలో నడిచాడు. డాక్టర్‌ అవ్వాలనే జీవితాశయాన్ని నెరవేర్చుకునేందుకు ఏకంగా 55 ఏళ్ల వయసులో ‘నీట్‌’కి హాజరయ్యాడు. అతని పేరు కె.రాజ్యక్కొడి. తమిళనాడులోని మదురై వాసి. రైతు. తెల్ల చొక్కా వేసుకున్నాడు. నెత్తి మీద జుట్టు కూడా తెల్లబడింది. మదురైలో మొన్న ఆదివారం జరిగిన నేషనల్‌ ఎంట్రన్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నీట్‌)కి హాజరయ్యేందుకు విద్యార్థులందరితోపాటు లైన్లో నిల్చున్నాడు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లటానికి అతని వంతు రాగానే సెక్యూరిటీ గార్డులు ఆపారు.

ఇంత వయసులో నువ్వు ఈ పరీక్ష రాయటానికి రావటమేంటి అనే అర్థం వచ్చేలా లుక్కేశారు. వాళ్లు ఆపినందుకు ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎవరికైనా ఈ డౌట్‌ వస్తుంది. దీంతో ఆయన తన చేతిలో ఉన్న హాల్‌ టికెట్‌ను చూపించగా మారుమాట్లాడకుండా లోపలికి అనుమతించారు. దీంతో అక్కడున్నవాళ్లందరూ అవాక్కయ్యారు. తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు, పరీక్ష కేంద్రం నిర్వాహకులు ముక్కు మీద వేలేసుకున్నారు. ఒకరినొకరు గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. అంబత్తైయాన్‌పట్టి ప్రాంతానికి చెందిన రాజ్యక్కొడి నిజానికి ఎప్పుడో డాక్టర్‌ కావాల్సింది.

also read: Kodali Nani: ఇతర రాష్ట్రాలలో రోడ్లపై గోతుల్లేవా? లేవని నిరూపించగలవా పవన్?

1984లోనే పరీక్షలన్నీ పాసయ్యాడు. కానీ అప్పట్లో ప్రైవేట్‌లో ఎంబీబీఎస్‌ ఫీజు కట్టే స్తోమత లేక బీఎస్సీ(ఫిజిక్స్‌)లో చేరి మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఈ లోపు మరెన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా డాక్టర్‌ కావాలనే కోరిక ఆయనలో అప్పటి నుంచీ రగులుతూనే ఉండిపోయింది. వయసు పెరుగుతుండటంతో జీవితంలో ఇక డాక్టర్‌ని కాలేనేమో అని కూడా అనుకున్నాడు. కానీ ఒడిశాకి చెందిన ఓ వ్యక్తి 64 ఏళ్ల వయసులో గతేడాది మెడికల్‌ కాలేజీలో సీటు పొందాడని తెలుసుకొని ప్రిపరేషన్‌ మొదలుపెట్టాడు. రోజుకు కనీసం మూడు గంటలు శ్రద్ధగా చదవాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాడు.

రాజ్యక్కొడి చిన్న కొడుకు వాసుదేవన్‌ రెండో ప్రయత్నంలో ‘నీట్‌’లో విజయం సాధించాడు. 521 మార్కులతో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సంపాదించాడు. దీంతో కొడుకు స్టడీ మెటీరియల్‌నే తండ్రీ చదవటం ప్రారంభించాడు. ఏడాది ప్రిపేరయ్యాడు. మాక్‌ టెస్టులెన్నో రాశాడు. మొత్తానికి మొన్న ‘నీట్‌’కీ అటెండ్‌ అయ్యాడు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రశ్నలు ఈజీగా వచ్చాయని చెప్పాడు. 460 మార్కులు వస్తాయని అంచనా వేస్తున్నాడు. తనకు కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు వస్తే డాక్టర్‌ కావాలనే జీవిత కలను సాకారం చేసుకుంటానని అన్నాడు. రాజ్యక్కొడి పట్టుదలకు హ్యాట్సాఫ్‌ చెప్పొచ్చు.

Show comments