INS Mahendragiri: భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ (INS Mahendragiri) ఈ రోజు అధికారికంగా భారత నౌకాదళంలోకి చేరింది. శనివారం విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఒక సదస్సులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను అధికారికంగా ఇండియన్ నేవీలో చేర్చారు. ఇది ప్రాజెక్ట్ 17ఏ కింద దేశీయంగా నిర్మించిన ఆరో యుద్ధనౌక కావడం గమనార్హం. దీనిని ఇండియన్ నేవీకి చెందిన ఈస్టర్న్ ఫ్లీట్ (తూర్పు నౌకాదళం) లో చేర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగంలో కొత్త శక్తిగా అవతరించిందని కొనియాడారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక ‘బ్లూ-వాటర్’ యుద్ధనౌక అని, ఇది కేవలం భారత తీరప్రాంతాలకే పరిమితం కాకుండా, సుదూర సముద్రాల్లో కూడా వారాల తరబడి మోహరించి శత్రువుల ఆట కట్టించగలదని స్పష్టం చేశారు. గగనతలం నుంచి వచ్చే ముప్పులను, శత్రు నౌకలను, సముద్ర గర్భంలో దాక్కునే జలాంతర్గాములను (సబ్‌మెరైన్స్) ఇది సమర్థంగా ఎదుర్కొంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
75 శాతం స్వదేశీ పరిజ్ఞానం..
మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) తయారు చేసిన ఈ యుద్ధనౌక ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందన్నారు. ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం, పరికరాలనే వాడటం విశేషం. సుమారు 6,670 టన్నుల బరువు ఉండే ఈ యుద్ధనౌక గరిష్టంగా గంటకు 52 కిలోమీటర్ల (28 నాట్స్) వేగంతో ప్రయాణించగలదు. శత్రువుల రాడార్ల కంటికి చిక్కకుండా ఉండే అధునాతన స్టీల్త్ ఫీచర్లు దీని సొంతం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత ఘోరమైన క్రూయిజ్ మిసైల్ అయిన ‘బ్రహ్మోస్’ ఉపరితలం నుంచి ఉపరితలానికి మార్చే క్షిపణులను ఇందులో అమర్చవచ్చు. వీటితో పాటు మల్టీ-పర్పస్ రాడార్, లాంగ్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ సిస్టమ్, ఇండిజినస్ రాకెట్ లాంచర్స్, టార్పెడో లాంచర్స్, యాంటీ సబ్‌మెరైన్ డిఫెన్స్ సిస్టమ్ వంటి ప్రపంచ స్థాయి ఆయుధాలు దీనికి రక్షణ కవచంగా ఉన్నాయి.
తూర్పు కనుమల ‘మహేంద్రగిరి’గా పేరు..
తూర్పు కనుమల్లోని ప్రసిద్ధ ‘మహేంద్రగిరి’ పర్వత శ్రేణి పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు. ఈ నౌక లోగోపై మహేంద్రగిరి పర్వత శిఖరంపై కూర్చుని ఉన్న ఒక డేగ రూపం ఉంటుంది. ఇది శత్రువుపై పదునైన దృష్టి, అసాధారణమైన ఓర్పు, తక్షణమే నిర్ణయాత్మక దాడి చేసే సామర్థ్యాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా, పాకిస్థాన్ దేశాల కదలికలు పెరుగుతున్న తరుణంలో, ఐఎన్ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో చేరడంతో దేశీయ నౌకాదళ వ్యూహాత్మక బలం మరింత రెట్టింపు అయిందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధ సమయాల్లోనే కాకుండా సముద్ర భద్రత, సహాయక చర్యలు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సహాయం అందించేందుకు కూడా ఈ యుద్ధనౌక ఎంతగానో ఉపయోగపడనుందని అభిప్రాయపడుతున్నారు.

