Influenza Cases Rise in Puducherry:పుదుచ్చేరిలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతన్నాయి. ఇటీవల కాలంలో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధికి సంబంధించిన కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న తరగతులను నిలిపివేశారు. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, విద్యాశాఖ మంత్రి ఎ. నమశ్శివాయం 1 నుంచి 8వ తరగతి ఉన్న తరగతులను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. గత వారం నుంచి వివిధ ఆస్పత్రుల్లో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరిగాయి. ఇన్‌ఫ్లూయెంజాతో బాధపడే పిల్లలతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. 50 శాతం వరకు ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: Deepa: చిత్ర పరిశ్రమలో విషాదం.. నటి దీప ఆత్మహత్య
చాలా మంది పిల్లలు దగ్గు, విపరీతమైన జ్వరాలతో ఆస్పత్రులకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. పిల్లలకు ఫ్లూ సోకితే ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుందని.. పిల్లల నుంచి వచ్చే తుంపర్లు, శ్లేష్మం ద్వారా, ప్రత్యక్ష తాకడి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని.. ఇది స్కూల్ పిల్లల్లో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పిల్లలు తప్పకుండా ఇళ్లకే పరిమితం కావాలని.. ముఖానికి తప్పకుండా మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాధి విస్తరిస్తుండటంతో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ ప్రభుత్వం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. కోవిడ్-19 కేసులు తగ్గిన తర్వాత ప్రజలు మాస్కులు లేకుండా.. భౌతిక దూరం పాటించకుండా మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాలకు తరలివస్తున్నారని.. దీంతో ఫ్లూ వంటి వ్యాధి వ్యాప్తి ఎక్కువ అయిందని తేలింది.
