Gandhi Family: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన తాజా ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ సంచలన విషయాలను వెల్లడిస్తోంది. నెహ్రూ-గాంధీ కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య సంబంధాలు సజావుగా లేవని ఈ పుస్తకం వెల్లడిస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఆమె ఇద్దరి కోడళ్లలో ఉన్న సంబంధాలను సోనియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ, కోడలు మేనకా గాంధీ మధ్య ఉన్న విభేదాలను సోనియా పుస్తకంలో రాశారు.
మేనక గురించి సోనియా కీలక విషయాలు..
ఇంట్లో పనివారు తనను ‘‘బహు రాణి’’(పెద్ద కోడలు), మేనకను ‘‘చోటీ బహూ’’(చిన్న కోడలు) అని పిలిచే వారని, తాను మేనకాలు ఇంటికి సమానమైన వారమే అని భావించానని సోనియా గాంధీ పేర్కొన్నారు. మేనకా గాంధీ మాత్రం ఆ పిలుపును తనను తక్కువ చేసినట్లు భావించేదని ఆమె అభిప్రాయపడ్డారు. సంజయ్, మేనక మధ్య కూడా విభేదాలు కనిపించేవని సోనియా రాశారు. మేనక కోపంగా ఉన్నప్పుడు ఇంట్లో పెద్దల సమక్షంలోనూ అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించేవారని, అవి సంజయ్‌ను ఇబ్బందికి గురిచేసేవని, కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచేవని పేర్కొన్నారు. సామాజికంగా కలిసిమెలిసి ఉండే స్వభావం కలిగిన యువతికి ఉమ్మడి కుటుంబంలో జీవించడం అంత సులభం కాకపోయి ఉండొచ్చని సోనియా అభిప్రాయపడ్డారు.
ఎమర్జెన్సీలో తారాస్థాయికి విభేదాలు..
ఎమర్జెన్సీ కాలంలో కుటుంబ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారిందని సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు. మేనక గురించి అప్పటి క్యాబినెట్ కార్యదర్శి పీఎన్ ధర్‌తో ఇందిరా గాంధీ మాట్లాడుతూ.. ఆమెకు ఇప్పుడే రెక్కలు వస్తున్నాయి అని వ్యాఖ్యానించినట్లు సోనియా రాశారు. సంజయ్ చేపట్టిన కార్యక్రమాల్లో మేనక ఆయనను ప్రోత్సహించడమే కాకుండా, వాటిలో జోక్యం చేసకుంటున్నారని ఇందిరా భావించే వారని పేర్కొన్నారు. 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత కుటుంబంలో చర్చలు తీవ్ర వాగ్వాదానికి దారితీశాయని సోనియా రాశారు. ఎమర్జెన్సీ సమయంలో సంఘటనకు సంజయ్ గాంధీ కారణమని సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఒక సమావేశంలో రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీతో మాట్లాడుతూ..‘‘సంజయ్, నిన్ను నేను క్షమించలేను. అమ్మను ఈ పరిస్థితికి తీసుకొచ్చావు” అని అన్నట్లు సోనియా గుర్తుచేశారు. మేనకకు తమపై వ్యతిరేకత పెరిగిపోయిందని, తమను శత్రువులుగా చూసేదని సోనియా పేర్కొన్నారు. తమ గురించి జర్నలిస్టుల ద్వారా కథనాలు ప్రచారం చేయించారని ఆరోపించారు.
సంజయ్ మరణంతో మారిన పరిస్థితులు..
1980 జూన్ 23న విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించారు. అప్పటికి మేనక వయసు 23 ఏళ్లు. మూడు నెలల వయసున్న కుమారుడు ఫిరోజ్ వరుణ్ (వరుణ్ గాంధీ)తో ఆమె మిగిలిపోయారు. సంజయ్ మరణం తర్వాత మేనకపై ఇందిరా గాంధీ శ్రద్ధ చూపారని సోనియా రాశారు. ఆమె బాగోగులు చూసుకోవడంతో పాటు కెన్యా, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాల అధికారిక పర్యటనలకు ఆమెను వెంట తీసుకెళ్లేదని, పారిస్‌లో చలి నుంచి రక్షణ కోసం కోటు కూడా కొనివ్వడాన్ని సోనియా ప్రస్తావించారు.
అయితే, రాజకీయ అంశాల విషయంలో ఇందిరా-మేనకల మధ్య విభేదాలు పెరిగినట్లు సోనియా చెప్పారు. మేనకకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి ఆమె ఇంకా చిన్నదని, రాజకీయంగా ఎదగలేదని ఇందిరా భావించే వారని సోనియా పేర్కొన్నారు. సంజయ్‌కు విధేయులుగా ఉన్న నాయకులు మేనకుకు రాజకీయ పదవి ఇవ్వాలని కోరేలా ఆమె తల్లి ప్రోత్సహించేదని సోనియా రాశారు.
వరుణ్ పుట్టినరోజుతో ముదిరిన వివాదం..
1981 మార్చిలో వరణ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ విభేదాలు మరింత పెరిగినట్లు సోనియా వివరించారు. చిన్న వేడుక నిర్వహించాలని ఇందిరా సూచించగా, ఆ వేడుకను వసుంధరా రాజే ఇంట్లో నిర్వహించినట్లు ఆ తర్వాత ఆమెకు తెలిసిందని పేర్కొన్నారు. వసుంధరా రాజే ఆర్ఎస్ఎస్కు గట్టి మద్దతుదారుగా, ఇందిరాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారని సోనియా ప్రస్తావించారు. ఇందిరాను బాధ పెట్టేందుకే ఈ వేడుకను నిర్వహించినట్లు సోనియా అభిప్రాయపడ్డారు. మేనక నిర్వహిస్తున్న ‘సూర్య’ పత్రికను ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న వ్యక్తికి విక్రయించడం కూడా ఇందిరా గాంధీని అవమానించడమే కాకుండా, సంజయ్, ఆయన తండ్రి జ్ఞాపకాలను అవమానించినట్లుగా భావించారని సోనియా పేర్కొన్నారు.
లక్నో ర్యాలీ.. ఇందిరా ఇంటి నుంచి మేనక నిష్క్రమణ..
ఇందిరా గాంధీ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో, మేనక లక్నోలో అసమ్మతి వాదుల ర్యాలీకి హాజరయ్యారని, తిరిగి వచ్చిన తర్వాత ఇందిరా ఆమెను ప్రశ్నించారని సోనియా చెప్పారు. కుటుంబంలో ఉంటూ పార్టీ వ్యతిరేక రాజకీయ కార్యకలాపాలను కొనసాగించలేరని, వాటిని మానుకోవాలి లేదా వేరే ఇంటి నుంచి వెళ్లిపోవాలని మేనకకు ఇందిరా చెప్పారని సోనియా రాశారు. చివరకు 1982 మార్చిలో మేనక తన కుమారుడు వరుణ్‌తో కలిసి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రోడ్ నివాసాన్ని విడిచిపెట్టారు.

