Site icon NTV Telugu

Harish Rana Dies: తుదిశ్వాస విడిచిన హరీష్ రాణా.. 13 ఏళ్ల నరకం నుంచి విముక్తి..

Harish Rana Died

Harish Rana Died

Harish Rana Dies: 13 ఏళ్లుగా కోమాతో నరకం అనుభవిస్తున్న హరీష్ రాణా ఎట్టకేలకు తుది శ్వాస విడిచారు. భారతదేశంలో పాసివ్ యుథనేషియా(ఇచ్చా మరణం)గా అనుమతి పొందిన తొలి వ్యక్తిగా హరీష్ రాణా సంచలనం సృష్టించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. మార్చి 11న సుప్రీంకోర్టు రాణా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. ఆయనకు అందిస్తు్న్న లైఫ్ సపోర్టును క్రమంగా తొలగించారు. డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని నిపుణులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

Read Also: Rajasthan Royals Sold Out: ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్.. రూ.15,000+ కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ అమ్మకం..!

31 ఏళ్ల హరీష్ రాణాను ఘజియాబాద్ లోని తన నివాసం నుంచి మార్చి 14న ఆస్పత్రికి తరలించారు. దీనికి ముందు సుప్రీంకోర్టు తన తీర్పులో ‘‘పాసివ్ యుథనేషియా’’కు అనుమతిస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఒక రోగి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వైద్యుడు తన చికిత్సను కొనసాగించాల్సిన పని లేదని, రాణా మరణానికి అనుమతి ఇచ్చింది.

2013లో పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సమయంలో, నాలుగో అంతస్తు నుంచి కిందపడిన రాణా తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. సుప్రీంతీర్పు తర్వాత ఆయనకు పోషకాహార మద్దతు క్రమంగా తగ్గించారు. ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో రోగికి ఎలాంటి నొప్పి కలుగకుండా చూసేందుకు వైద్యులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎలాంటి బాధాకరమైన అనుభూతి కలుగకుండా నొప్పి మందుల్ని అందించారు. చివరకు 13 ఏళ్ల నరకం నుంచి రాణాకు మరణం లభించింది.

Exit mobile version