Site icon NTV Telugu

Indian Railways: ప్రత్యేక రైళ్లతో గత ఏడాది భారతీయ రైల్వేకు భారీ ఆదాయం.. ఎంతో తెలుసా?

Indian Railways

Indian Railways

Indian Railways: 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు ప్రత్యేక రైళ్ల ద్వారా భారీస్థాయిలో ఆదాయం సమకూరింది. పండగలు, ప్రత్యేక దినాల సమయంలో ఇండియన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే ఎంత మేరకు ఆర్జిస్తుందన్న విషయంపై చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా రైల్వేశాఖ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు గత ఆర్ధిక ఏడాది ప్రత్యేక రైళ్ల ద్వారా భారతీయ రైల్వే రూ.17,526.48 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్ల ద్వారా కేవలం రూ.804.78 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. 2020-21 నాటికి ఈ ఆదాయం రూ.12,02,7.81 కోట్లకు చేరిందని రైల్వేశాఖ పేర్కొంది.

Read Also: Police Dog: 22 కి.మీ దూరంలో సాక్ష్యాలను పసిగట్టింది.. ఈ కుక్క మామూలుది కాదండోయ్..

అటు 2021-22లో నాలుగు త్రైమాసికాల్లో ప్యాసింజర్‌ రైళ్ల ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల ద్వారా రూ. 4,921.11 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.10,513 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.11,873 కోట్లు కాగా.. చివరి త్రైమాసికంలో రూ.11,796.81 కోట్లతో మొత్తంగా రూ.39,104.41 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా 2019-20లో ప్రయాణికుల టిక్కెట్ల విక్రయం ద్వారా రైల్వేశాఖకు రూ.50,669.09 కోట్ల ఆదాయం సమకూరింది. కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మాత్రం ప్రయాణికుల టిక్కెట్ల ద్వారా సమకూరిన ఆదాయం రూ.15,248.49 కోట్లకు పడిపోయింది.

Exit mobile version