Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వైమానిక దళం, పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలితీసుకున్న నేరానికి ప్రతీకారంగా పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి, 100 కు పైగా ఉగ్రవాదుల్ని భారత్ హతమార్చింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని క్షిపణులను ఉపయోగించి భారత్ ధ్వంసం చేసింది.
Read Also: DRI: పాకిస్థాన్‌కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!
అయితే, ఇదే సమయంలో మరో భారీ ప్రమాదం నుంచి పాకిస్తాన్ తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భారత్ నేవీ కూడా పాకిస్తాన్‌పై దాదాపుగా దాడికి సిద్ధమైంది. నేవీకి టార్గెట్ ప్యాకేజీ కూడా కేటాయించబడింది. పాకిస్తాన్ లోపల లక్ష్యాలపై, సర్ఫేస్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు నేవీ సిద్ధమైంది. పాకిస్తాన్ నేవీకి చెందిన నౌకలు, జలాంతర్గాములు, కరాచీ పోర్టు వంటివి భారత్ హిట్ హిస్టులో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే, చివరి నిమిషాల్లో దాడులకు తుది ఆదేశాలు రాకపోవడంతో పాకిస్తాన్ బతికిపోయినట్లు తెలుస్తోంది.
కరాచీ పోర్టులోని పాక్ నేవీ నౌకలతో సహా పాకిస్తాన్‌లోనే లక్ష్యాలపై బహ్మోస్ క్షిపణులతో, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లతో దాడులు జరిగేవి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు రెండూ కూడా యాంటీ-షిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులతో సిద్ధంగా ఉన్నాయి. అప్పటికే, పాక్ నేవీకి చెందిన కీలక యుద్ధ నౌకలు, కార్వెట్స్ సహా కీలక ఆస్తులు కరాచీ పోర్టులో ఉండిపోయాయి. ఒక వేళ భారత నేవీకి ఆదేశాలు వచ్చి ఉంటే ఓడరేవుతో సహా పాక్ నేవీ నాశనం అయ్యేది. ఉత్తర అరేబియా సముద్రంలో భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్‌తో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత నేవీ పాకిస్తాన్ వైమానిక ఆస్తులపై కూడా ఒత్తిడిని కొనసాగించినట్లు తెలుస్తోంది.
