NTV Telugu Site icon

Gujarat: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిపోయిన బాలుడిని రక్షించిన ఆర్మీ

Gujarat2

Gujarat2

బోరు బావుల్లో ప్రమాదవశాత్తు పడి మరణించిన ఉదంతాలు ఎన్నో చూశాం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బోరుబావిలో పడి చనిపోయిన ఘటనలు జరిగాయి. ఆడుకుంటూ వెళ్లి తెరిచి ఉన్న బోరు బావుల్లో పడి మరణించారు. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఉదంతాల్లో మరణించిన వారే ఎక్కువ. అతి తక్కువ శాతం మంది బతికి బయటపడి మృత్యుంజయులుగా నిలుస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ లో జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ రెస్క్యూ చేయడంతో 18 నెలల బాలుడు మృత్యుంజయుడిగా నిలిచాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్‌ జిల్లా ధృంగధర తాలూకాలో దుధ్‌ పూర్ లో జరిగింది. ఏడాదిన్నర బాలుడు శివమ్ 300 అడుగుల లోతు ఉన్న ఓ బోరు బావిలో పడిపోయాడు. వెంటనే పోలీసులుకు ఫోన్ చేశారు స్థానిక ప్రజానీకం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్, ధ్రంగ్ ధర మిలిటరీ స్టేషన్ కు ఫోన్ చేసి బోరుబావిలో పడిన చిన్నారిని రెస్క్యూ చేయాలని కోరారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్మీ క్విక్ రియాక్షన్ టీమ్ 300 అడుగులు ఉన్న బోరుబావిలో బాలుడు శివమ్ 25 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్లు గుర్తించారు. చిన్నారి ముక్కు వరకు నీరు చేరిందని.. అతడు ఊపిరి పీల్చుకుంటుండటంతో పాటు అరుపులు వినిపించాయి. దీంతో వెంటనే రెస్య్కూ ప్రారంభించింది ఆర్మీ. కెప్టెన్ సౌరవ్ ఆధ్వర్యంలోని ఆర్మీ మెటాలిక్ హుక్ ను తగిలించిన ఓ తాడును బోరు బావిలోకి విడిచారు. నిమిషం వ్యవధిలోనే మెటాలిక్ హుక్ బాబు టీషర్ట్ కు తగిలింది. వెంటనే బోరు బావి నుంచి బాలుడిని పైకి లాగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బాలుడిని వైద్య పరీక్షల కోసం సురేంద్రనగర్‌లోని సియు షా ఆసుపత్రికి తరలించారు, బాలుడు శివమ్ పరిస్థితి నిలకడగా ఉంది.

రెస్క్యూ వీడియోను పీఆర్వో డిఫెన్స్ గుజరాత్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. కొద్ది సమయంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. రెస్క్యూ చేసిన ఆర్మీని నెటిజెన్లు అంతా ప్రశంసిస్తున్నారు.