Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను అమెరికన్ గడ్డపై హతమార్చేందుకు కుట్ర పన్నాడని, భారతీయ వ్యక్తి నిఖిల్ గుప్తా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అమెరికన్ అధికారులు ఒత్తిడి మేరకు చెక్ రిపబ్లికన్ అధికారులు ఆ దేశంలో నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పన్నూను హతమార్చే కుట్ర తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఇది భారత్-అమెరికా సంబంధాలపై గణనీయమైన నష్టానికి దారి తీయెచ్చని యూఎస్ కాంగ్రెస్ లోని భారతీయ-అమెరికన్ చట్టసభ సభ్యులు శుక్రవారం హెచ్చరించారు. ఈ సమస్యను సరిగా పరిష్కరించకపోతే సమస్య తప్పదని చెప్పారు.
భారత-అమెరికన్ చట్టసభ సభ్యులు అమీ బెరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీ తానేదార్ ఒక సంయుక్త ప్రకటనలో ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎస్ న్యాయశాఖ అభియోగ పత్రాల్లో నిఖిల్ గుప్తాపై సంచలన అభియోగాలు మోపింది. ఈ ఆరోపణకు సంబంధించి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన సమావేశం అనంతరం ఈ ప్రకటన విడుదలైంది.
Read Also: BJP: “జిన్నా ఆత్మ ఓవైసీలోకి ప్రవేశించింది”.. కేంద్రమంత్రి విమర్శలు..
ఈ కేసు ముఖ్యంగా భారత్-అమెరికా భాగస్వామ్యంపై ప్రభావాన్ని చూపిస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు, నేరారోపణలో పేర్కొన్న చర్యలు తగిన విధంగా పరిష్కరించకపోతే, రెండు దేశాలకు నష్టం కలిగిస్తుందని చట్టసభ సభ్యులు హెచ్చరించారు. ఈ కుట్రపై భారత్ పూర్తిగా దర్యాప్తు చేయడంతో పాటు భారత ప్రభుత్వ అధికారులతో పాటు ఇందులో ప్రమేయం ఉన్న అందర్ని బాధ్యులు చేయాలని, మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా హామీ ఇవ్వాలని వారు కోరారు. పన్నూ హత్యకు కుట్రపై దర్యాప్తు చేయడానికి భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించడాన్ని ఇండో-అమెరికన్ నేతలు స్వాగతించారు.
భారత్ చేత గుర్తించబడిన ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ అమెరికన్-కెనడా ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. అతడిని అమెరికన్ గడ్డపై చంపేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తి, ఓ కాంట్రాక్టు హంతకుడికి డబ్బులు ఇచ్చాడని, అయితే ఈ ప్లాన్‌ని అమెరికా అధికారులు అడ్డుకున్నట్లు నవంబర్ 29న యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అతనిపై అభియోగాలు మోపారు. ఈ కట్రలో ఓ భారతీయ ప్రభుత్వ ఉద్యోగి సహకరించినట్లు అమెరికన్ ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. అమెరికా అభ్యర్థన మేరకు జూన్ 30న చెక్ రిపబ్లిక్ లో గుప్తాను అరెస్ట్ చేశారు. అతడిని తమకు అప్పగించాలని అక్కడి అధికారులను అమెరికా కోరుతోంది.