India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్

  • అమెరికా చట్టాలు ఇక్కడ నడవవు
  • మా చట్ట ప్రకారం నడవాల్సిందే
  • మెటాకు కేంద్రం వార్నింగ్
Meta

Meta

ప్రస్తుతం భారత ప్రభుత్వం-మెటా మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ప్రధాని మోడీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పాల్సిందేనని కేంద్రం పట్టుబట్టడంతో మెటా సీఈవో జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు.

తాజాగా మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా సహా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు అమెరికా రాజ్యాంగం ప్రకారం కాకుండా భారత రాజ్యాంగం, భారత చట్టాల ప్రకారమే వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మెటాకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మెటా గ్లోబల్ బృందంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా సంస్థ ఉపయోగిస్తున్న అల్గారిథమ్‌లు, నిబంధనల అమలు విధానం, తనిఖీ వ్యవస్థలు, ప్లాట్‌ఫారమ్‌లో అమలవుతున్న భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై కేంద్రం వివరణ కోరనుంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, దేశ చట్టాలను అవి ఉల్లంఘిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. అలాగే చెల్లింపు ఆధారంగా ప్రచారం చేసే కంటెంట్‌కు కూడా ప్లాట్‌ఫారమ్‌లే బాధ్యత వహించాలా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపాయి.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, మెటా గ్లోబల్ బృందం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. భారత రాజ్యాంగం, చట్టాలకు అనుగుణంగా పనిచేసేలా మెటా అమలు చేస్తున్న విధానాలపై కేంద్రం సమగ్రంగా సమీక్షించనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. అందులో పేర్కొన్న సమంజసమైన పరిమితులను అన్ని సోషల్ మీడియా సంస్థలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదే అంశంపై పార్లమెంటరీ సమాచార సాంకేతిక శాఖ స్థాయీ సంఘం సభ్యుడు, ఎంపీ అనూప్ సంజయ్ ధోత్రే కూడా స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని, అయితే దానికి కొన్ని పరిమితులు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మెటాతో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగం వల్ల కొంతమంది వ్యక్తిగతంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.

ఇటీవల ప్రధాని మోడీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్టు తొలగించబడిన ఘటనను ప్రస్తావించిన ధోత్రే.. ఈ అంశంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్ మెటాను క్షమాపణ చెప్పాలని కోరారని తెలిపారు. అనంతరం మెటా ఈ ఘటనపై క్షమాపణలు తెలిపినట్లు పేర్కొన్నారు.

అసోచామ్ నిర్వహించిన 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్-2026 కార్యక్రమంలో పాల్గొన్న ధోత్రే.. భారత్ వేగంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. సాంకేతికత ఆధారిత ఉద్యోగాల సృష్టి, ఆర్థిక సాధికారత, సైబర్ మోసాలు, ఆర్థిక నేరాల నుంచి రక్షణ వంటి అంశాలపై తదుపరి దశలో దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయం వంటి రంగాల్లో ఫిన్‌టెక్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పరిశ్రమలు-ఫిన్‌టెక్ సంస్థలు-ప్రభుత్వం కలిసి పనిచేసే విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.