Site icon NTV Telugu

PM Modi: ఇండియా కూటమి “సనాతన ధర్మాన్ని” అంతం చేయాలనుకుంటోంది..

Pm Modi

Pm Modi

PM Modi: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తొలిసారిగా బహిరంగంగా ప్రధాని మోడీ స్పందించారు. మధ్యప్రదేశ్ లో బీనాలో ఆయన పలు అభివృద్ధి పథకాలను శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో సనాతన వ్యాఖ్యలపై మాట్లాడారు. “ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని భావిస్తోందని” వ్యాఖ్యానించారు. మరో వెయ్యేళ్లు బానిసత్వం వైపు నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్‌లకు స్పూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని ఈ కూటమి తుడిచేయాలని అనుకుంటోందని ఆరోపించారు. బహిరంగంగా సనాతన ధర్మాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారని, రేపు మనపై కూడా దాడులను పెంచుతారని, దేశవ్యాప్తంగా ఉన్న సనాతనవాదులు, దేశాన్ని ప్రేమించే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని అరికట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.

Read Also: Madhya Pradesh: చికెన్ ఇవ్వలేదని షాప్ యజమాని బుర్రపగులగొట్టి పరారైన యువకులు

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ(కాంగ్రెస్) అవినీతి, నేరాలు తప్పా ఇంకేం ఇవ్వలేదని ప్రధాని విమర్శించారు. జీ20 ఎంత విజయవంతమైందో మీరంతా చూశారు, ఈ ఘనత దేశ ప్రజలకు దక్కుతుందని ఆయన అన్నారు. ఇది 140 కోట్ల భారతీయుల విజయమని పేర్కొన్నారు. బీనాలో రిఫైనరీలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చడంలో దోహదపడుతుందని.. ఆధునిక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ బీనాను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, దీంతో కొత్త పరిశ్రమలు ఇక్కడకు వస్తాయని, ఎంఎస్ఎంఈ అవకాశాలు లభిస్తాయని, యువతకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని ప్రధాని తెలిపారు. రూ.50,000 కోట్ల ప్రాజెక్టులను ఈ రోజు మధ్యప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రప్రజలను కలుసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలస్తూ దాన్ని నిర్మూలించాలని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ మరోనేత ఏ రాజా మాట్లాడుతూ.. సనాతన ధర్మం ఎయిడ్స్, కుష్టు వంటిదని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారి తీశాయి. ముఖ్యంగా పలు హిందూ సంఘాలు, బీజేపీ పార్టీ డీఎంకే, కాంగ్రెస్ పార్టీలను, ఇండియా కూటమిని టార్గెట్ చేశాయి. ఇండియా కూటమికి హిందువులంటే ద్వేషం అంటూ బీజేపీ ఆరోపించింది.

Exit mobile version