India-UK Trade Deal: భారత్, యూకే మధ్య ప్రతిష్టాత్మక ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)’’ కుదిరింది. గురువారం లండన్‌లో ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. మూడేళ్లుగా చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. దీంతో, రెండు దేశాలు లబ్ధి పొందనున్నాయి. రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఏటా 34 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనేక రంగాల్లో భారతీయులకు వృద్ధి , నైపుణ్యాభివృద్ధి, ఉపాది అవకాశాలకు కొత్త మార్గాలు తెరవడం ద్వారా భారత్ గణనీయమైన ప్రయోజనాలు పొందనుంది.
ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా భారతీయులకు కొన్ని వస్తువులు మరింత చౌకగా మారనున్నాయి. ముఖ్యంగా యూకే నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు చాలా తగ్గుతాయి.
1) భారత పరిశ్రమలు, ప్రజలు యూకే నుంచి దిగుమతి అయ్యే మెడికల్ వస్తువులు, ఏరోస్పేస్ భాగాలు మరింత చౌకగా లభిస్తాయి.
2) సాఫ్ట్ డ్రింక్స్, సౌందర్య సాధనాలు, చాక్లెట్స్, బిస్కట్స్, సాల్మన్, లాంబ్, కార్‌ల ధరలు సరసమైన ధరలరకు లభిస్తాయి. సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై టారిఫ్స్ 110 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతాయి.
3) ట్రేడ్ డీల్ కార్యరూపం దాల్చిన తర్వాత బ్రిటిష్ సంస్థలు తయారు చేసే విస్కీ, ఇతర ఉత్పత్తులు చౌక ధరలకు లభిస్తాయి. విస్కీపై సుంకం 150 నుంచి 75 శాతానికి తగ్గుతుంది. 10 ఏళ్లలో 40 శాతానికి తగ్గుతుంది.
4) వస్తువులతో పాటు భారతీయులు యూకేలో నివసించడాన్ని సులభతరం చేస్తుంది. భారతీయ నిపుణులు ఇప్పుడు దేశంలో కార్యాలయం లేకుండా కూడా 2 ఏళ్లు యూకేలోని 35 రంగాల్లో పనిచేయగలరు. దీని వల్ల 60,000 మందికి పైగా ఐటీ నిపుణులకు ప్రయోజనం కలుగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
5) ఈ ఒప్పందం ప్రకారం భారతీయ నిపుణులు కూడా 3 సంవత్సరాల పాటు UK సామాజిక భద్రతా చెల్లింపుల నుండి మినహాయించబడతారు.
6) ఈ ఒప్పందం ద్వారా చెఫ్, యోగా ఉపాధ్యాయులు, సంగీకారులు, ఇతర కాంట్రాక్ట్ ఆధారిత కార్మికలుు యూకే ఉద్యోగ మార్కెట్ లోకి ప్రవేశించడం సులువు అవుతుంది.
బ్రిటన్ ప్రయోజనాలు ఇవే:
యూకే వ్యాపారులు భారతదేశంలో ప్రభుత్వ సేకరణ అవకాశాలు పొందుతాయి. బ్రిటిష్ కంపెనీలు రూ. 2 బిలియన్ కంటే ఎక్కువ విలువైన సున్నితమైన ప్రభుత్వ టెండర్లపై వేలం వేయగలవు. దీని అర్థం ఏంటంటే, యూకే ప్రతీ సంవత్సరం 40,000 టెండర్లలో పాల్గొనగలదు. యూకేలో కార్మికులకు ప్రతీ ఏడాది 2.2 బిలియన్ పౌండ్ల వరకు వేత పెరుగుదల లభిస్తుంది. బ్రిటిష్ ప్రజలకు భారత్ నుంచి వెళ్లే వస్తువులైన వస్త్రాలు, బూట్లు, ఆహార ఉత్పత్తులు తక్కువ ధరలకు దొరకుతాయి. ట్రేడ్ అగ్రిమెంట్ ఫలితంగా యూకే ప్రత్యక్షంగా 2200 ఉద్యోగాలను సృష్టిస్తుంది.