Arvind Kejriwal arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఈ అరెస్ట్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను పిలిచింది. 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
‘‘ దౌత్యవ్యవహారాల్లో ఇతర దేశాలు వేరే వారి సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని భావిస్తున్నాము. తోటి ప్రజాస్వామ్యాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది.’’ అని తెలిపింది. ‘‘భారతదేశం యొక్క చట్టపరమైన ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయి, ఇది లక్ష్యం మరియు సమయానుకూల ఫలితాలకు కట్టుబడి ఉంటుంది. దానిపై అపోహలు వేయడం అసంబద్ధం’’ అని భారత విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Read Also: Satyakumar: మేం మోడీ కోసం పని చేస్తున్నాం.. నిన్న అందుకే సమావేశానికి రాలేదు..!
అంతకుముందు మంగళవారం అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి కేజ్రీవాల్ అరెస్టు గురించి మాట్లాడుతూ.. ‘‘న్యాయమైన, పారదర్శక, సమయానుకూల న్యాయప్రక్రియ’’ ఉండేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర భారతీయ పౌరుల మాదిరిగానే కేజ్రీవాల్‌కి కూడా న్యాయమైన, నిష్పాక్షిక విచారణకు అర్హులని ఇటీవల జర్మనీ విదేశాంగ కార్యాలయం చెప్పిన కొద్ది రోజుల తర్వాత అమెరికా కూడా కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించింది. ‘‘న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్ర్యం మరియు ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని మేము భావిస్తున్నాము మరియు ఆశిస్తున్నాము’’ అని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి శుక్రవారం చెప్పారు.
అయితే, జర్మనీ వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది. భారత ప్రభుత్వం జర్మన్ రాయబారిని పిలిపించింది, భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని తీవ్రంగా చెప్పింది. ప్రస్తుతం అమెరికా విషయంలో కూడా భారత్ ఇదే వైఖరి అవలంభించే అవకాశం ఉంది.