NTV Telugu Site icon

Indus Water Treaty: మోడీ మాస్టర్ స్ట్రోక్.. ఇదే జరిగితే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం..

Indus Water Treaty

Indus Water Treaty

Indus Water Treaty: దాయాది దేశం, ఉగ్రవాదుల ఉత్పత్తి కర్మాగారంగా ఉన్న పాకిస్తాన్‌కి భారతదేశం మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘‘సింధు జల ఒప్పందాన్ని’’ సమీక్షించాలని పాకిస్తాన్‌కి నోటీసులు పంపింది. ప్రజల ఆందోళనలు, జనాభా మార్పులు, పర్యావరణ సమస్యలు, శక్తి అవసరాలకు అనుగుణంగా సమీక్షించాలని నోటీసులు జారీ చేసింది. పాకిస్తాన్ పదేపదే భారత్ లక్ష్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న తరుణంలో ఈ చర్య వచ్చింది.

ప్రాథమిక, అనూహ్యమైన మార్పులను పేర్కొంటూ పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని (IWT) ని సమీక్షించాలని భారతదేశం పిలుపునిచ్చింది. భారత్ పంపిన నోటీసులు పాకిస్తాన్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఒప్పందంలోని ఆర్టికల్ XII(3) ప్రకారం ఆగస్టు 30న పాకిస్థాన్‌కు నోటీసు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1960లో సింధు నది, దాని ఉపనదుల జలాల పంపిణీపై పాక్-భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా, రాట్లే పవర్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ గగ్గోలు పెడుతున్న సమయంలోనే ఈ నోటిఫికేషన్ జారీ అయింది.

ఏమిటీ ఒప్పందం..?

సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లు, పాకిస్తాన్‌కి సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది.

పలు సందర్భాల్లో ఈ ఒప్పందం వివాదాస్పదమైంది. ఈ ఒప్పందం వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్‌కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి ఇండస్ వాటర్ ట్రిటీపై భారత్ నోటీసులు ఇచ్చింది.

ఇదే జరిగితే పాక్ ఎడారి:

ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశానికి సింధు నదీ జలాలే ప్రధాన వనరు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ దేశంలో ఈ నదీ జలాలు అత్యంత కీలకం. అయితే, ఈ నదీ జలాలను కేవలం పంజాబ్ మాత్రమే సమర్థంగా వినియోగించుకుంటోంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఒక వేళ భారత్ నుంచి వెళ్లే ఈ నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే, పాకిస్తాన్ ఏడారిగా మారడం ఖాయం. పలు సందర్భాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేసినా, భారత్‌పై యుద్ధానికి తెగబడిని కూడా మన దేశం ఎప్పుడూ ఈ నది జలాల విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ, ప్రస్తుతం మోడీ సర్కార్ మాత్రం మన దేశ అవసరాలకు అనుగుణంగా ఈ నదీ జలాల ఒప్పందాలను సవరించాలని భావిస్తోంది.